ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతోంది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా కట్టడి, ఆక్సిజన్, బెడ్స్, వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. నిన్న తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోవడంపై ప్రభుత్వం పూర్తిగా అలెర్ట్ అయింది. ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
అందరూ ఎంతో కష్టపడుతున్నా కొన్ని అనుకోని ఘటనలు జరుగుతున్నాయని, అవి తీవ్ర బాధాకరమని అన్నారు ఏపీ సీఎం జగన్. రుయా ఆస్పత్రిలో 11 మంది ఆక్సిజన్ అందక చనిపోవడం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి సమయంలో కలెక్టర్లు, అధికారులు ఇంకా మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. రుయాలో చనిపోయిన 11 మందికి పది లక్షల రూపాయల చొప్పున సాయాన్ని ప్రకటించింది ప్రభుత్వం.
మరోవైపు, ఏపీలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే, గడిచిన 24 గంటల్లో 20,345 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి చేరింది. ఇందులో ప్రస్తుతం 1,95,102 మంది చికిత్స పొందుతుండగా 11,18,933 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8,899కి చేరింది.
Read Also… Corona Vaccine Overdose: ఆ యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!