Pawan Kalyan: ఆ ఐదు జిల్లాలే మెయిన్.. మురాసు తుఫాన్ ఎఫెక్ట్‌పై అధికారులకు కీలక ఆదేశాలు
ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాన్ ముప్పుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.అర్నబ్ తుపాను మాదిరి మురసు తుపానును కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

అర్నబ్ తుపాను విధ్వంసం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోక ముందే మురసు రూపంలో మరో తుపాను ముప్పు రాష్ట్రానికి పొంచి ఉన్న నేపథ్యంలో విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూఎస్ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మురసు తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ఆయా జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
పునరావాస కేంద్రాల ఏర్పాటు
అవసరం ఉన్న చోట పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, తాగునీరు, భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను తక్షణం పునరుద్ధరించడం, రోడ్లపై చెట్లు కూలితే తక్షణం తొలగించడం వంటి చర్యల్లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. మురసు తుపాను ఈ రోజు తీరం తాకనుందన్న హెచ్చరికల నేపథ్యంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావం ఉండనున్న జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
మురసు తుపాను మొదట బాపట్ల, మచిలీపట్నం మధ్య తీరం తాకుతుందని అంచనా వేయగా, ప్రస్తుతం తుపాను దిశ మార్చుకుని నెల్లూరుకు సమీపంగా తీరం దాటబోతోందని, తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, మార్కాపురం జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వివరించారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు ఈ మధ్యాహ్నం తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరాన్ని తాకే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అత్యంత భారీ వర్షాలు కురిసి, ఆకస్మిక వరదలకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
అర్నబ్ తుపాను మాదిరి మురసు తుపానును కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖలతో కలసి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు.
గ్రామాలకు సమీపంలో ఉండే వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, ఉదృతంగా ప్రవహించే వాగుల వద్దకు ప్రజలు వెళ్లకుండా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షపు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన వెంటనే బ్లీచింగ్, క్లోరినేషన్ చేసేందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని నిర్దేశం చేశారు.
ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్న క్రమంలో నష్టం జరిగిన తర్వాత వీలైనంత త్వరగా పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సిబ్బందికి సూచనలు చేశారు. వర్షాలకు రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కొట్టుకుపోయినా వెంటనే స్పందించాలని, ప్రమాదకరమైన రహదారులు, లోలెవల్ కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలో తుపాను తాలూకు అలజడి పూర్తిగా తగ్గి, అధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని, తీర ప్రాంత ప్రజలు బీచ్‌ల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తుపాను సమయంలో అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
పంటల నష్టం తగ్గించేలా రైతులకు ముందస్తు సూచనలు చేయాలని, భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగిన చోట, వర్షపు నీటిని వెంటనే మళ్లించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలు పాటిస్తూ, యంత్రాంగానికి హకరించాలని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేవ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
