కడప జిల్లా గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డిపల్లిలో బీజేపీ ఏజెంట్లను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ. చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ అన్నారు. 149, 150 పోలింగ్ స్టేషన్ల వద్ద స్థానిక ఎస్ఐ వైసీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బయట ప్రాంతానికి చెందిన వందలాది మంది నిన్న రాత్రే బద్వేల్ నియోజకవర్గం చేరుకున్నారని చెప్పారు. పోలీసుల తీరు చూస్తుంటే వాళ్లే దగ్గరుండి రిగ్గింగ్ చేయించాలా ఉందన్నారు.
బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు ఉన్నారని బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి అన్నారు. అనేక పోలింగ్ బూతుల్లో బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారని ఆరోపించారు. సిట్టింగ్ అభ్యర్థి మరణించినట్టైతే, వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న పక్షంలో పోటీ పెట్టం అన్న టీడీపీ ప్రకటన పచ్చి అబద్ధం అని స్పష్టం అవుతుందని చెప్పారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఈ ఉప ఎన్నికలో జగన్ అభ్యర్థిదే ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బద్వేల్ నియోజకవర్గంలోని చింతల చెరువులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఏజంట్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోరుమామిళ్ల రంగసముద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అధికారులు 77A బూత్‌లో 20 నిమిషాలు ఆలస్యంగా ఓటర్లను అనుమతించారు. బద్వేల్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 221 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ ఉపఎన్నిక పోలింగ్‌కు 3000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది.
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.