
విభజన హామీల్లో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి దశాబ్ద కాలం అయినా కొన్ని కేటాయింపులు జరగలేదు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాలకు రావల్సిన విభజన కేటాయింపుల్లో భాగంగా ఏపీ భవన్ ను విభజించింది కేంద్ర హోం శాఖ. ఈ మేరకు మార్చి 16 శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ 2014లో ఏర్పడింది. అయితే విభజన హామీల్లో భాగంగా కొన్ని కేటాయింపులు చేయాల్సి ఉంది కేంద్రం. అక్కడి ఉమ్మడి భవనాల విషయంలో తీవ్రజాప్యం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నతాధికారులు దీనిపై చర్చించారు. తమ రాష్ట్రాలకు రావల్సిన వాటాల గురించి ఒక నివేదిక తయారు చేశారు. దీనిని కేంద్ర హోం శాఖకు పంపించారు. వాటిని పరిశీలించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శులు ఢిల్లీలోని అశోకా రోడ్ లోని ఏపీ భవన్ ను ఇరు రాష్ట్రాలకు విభజించారు.
ఆంధ్రప్రదేశ్ భవన్ మొత్తం విస్తీర్ణం 19.781 ఎకరాలుగా గుర్తించారు. ఈ స్థిరాస్తి విలువ రూ. 9,913.505 గా తెలిపారు. ఇందులో భాగంగా 11.536 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించగా.. తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. ఇక ఏపీకి కేటాయించిన 11 ఎకరాల్లో 5.781 ఎకరాల విస్తీర్ణంలోని ఏపీ భవన్, 4.315 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల విస్తీర్ణంలోని నర్సింగ్ హాస్టల్, 2.396 ఎకరాల్లోని పటౌడీ హౌస్, 0.512 విస్తీర్ణంలోని ఇంటర్నల్ రోడ్డు, 0.954 విస్తీర్ణంలోని శబరీ బ్లాక్ ను కేటాయించారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. 8.245 ఎకరాలు కేటాయించగా.. 5.245 ఎకరాల విస్తీర్ణంలోని పటౌడీ హౌజ్, మిగిలిన భాగాన్ని శబరీ బ్లాక్‌గా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన స్థలం విలువ రూ. 5,781.416 కోట్లు కాగా తెలంగాణకు కేటాయించిన ఆస్తుల విలువ రూ. 4,132.089 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…