
బైక్ ఇంటికెళ్తుండగా.. కుక్కలు వెంబడించడంతో.. వాటిని తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి.. బైక్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయచోటిలోని లక్ష్మీపురంలో నివాసం ఉండే ఫజిల్ (42) ఆదివారం రాత్రి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ దారి గుండా ద్విచక్ర వాహనంపై తన ఇంటికి వెళుతున్నాడు. అయితే అతన్ని చూసిన కొన్ని వీధికుక్కలు.. బైక్‌ను వెంబడించాయి.
దీంతో ఏం చేయాలో అర్థం కాక.. కుక్కల నుంచి తప్పించుకునేందుకు తన వాహనాన్ని అతి వేగంగా నడపాడు ఫజిల్.. ఈ క్రమంలో అనుకోకుండా ఎదురుగా ఉన్న గుడిని బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన ఫజిల్ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే విషయాన్ని పోలీసులు తెలియజేశారు. సమాచారం అందుకున్న రాయచోటి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేమాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణంలో రోడ్లపై ఎక్కడికక్కడ కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని అనేకసార్లు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా వారిలో మాత్రం ఎటువంటి చలనం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రావస్త నుంచి బయటికి వచ్చి మరో ప్రాణం బలి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.