Andhra News: ఏపీలో మరో భారీ స్కామ్ తెరపైకి.. గోల్డ్ గోల్‌మాల్
ఏపీలో మరో భారీ స్కామ్ తెరపైకి వచ్చింది. కనక దుర్గ గోల్డ్ ఫైనాన్స్‌కు కోట్లలో కుంభకోణం జరిగింది. చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కనక దుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో పది కోట్ల స్కామ్ జరిగినట్టు తేలింది. మిగత బ్రాంచ్‌ల్లోనూ ఇదే దగానా? కస్టమర్ల ఒరిజినల్ నగలను సైతం మాయం చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బంగారంపై రుణాలు…ఇలాంటి బోర్డు చూసి.. ఎలాంటి వెరిఫై చేయకుండా నగలు తాకట్టు పెడితే జరిగేది మోపం. చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో అదే జరిగింది. ఆఫీసులో దొంగలు పడలేదు… కానీ నకిలీ బంగారంలో బడా గోల్‌మాల్‌కు తెరలేపిన ఇంటి దొంగల వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరులో కనకదుర్గా గోల్డ్ లోన్స్ సంస్థకు ఉద్యోగులే పంగనామాలు పెట్టారు. తమ బంధువుల, స్నేహితుల ద్వారా నకిలీ బంగారం తనఖా పెట్టించి ఎడాపెడా లోన్లు ఇచ్చేశారు. చెక్ చేస్తే ఆడిట్‌లో 8 కోట్ల స్కామ్ బయటపడింది. సిబ్బంది సహా 26 మందిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు.
మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌లోనూ సేమ్ టు సేమ్ స్కామ్ తెరపైకి వచ్చింది. కంపెనీ మేనేజర్, సిబ్బంది కుమ్మకై నకిలీ బంగారం తాకట్టు పెట్టి 56 లక్షల నగదు నొక్కేశారు. కంపెనీ ఆడిట్‌లో అసలు విషయం బయటపడింది. కనక దుర్గ గోల్డ్ ఫైనాన్స్ ప్రతినిధుల ఫిర్యాదుతో బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ , అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆడిటర్ రామాంజనేయులు, మేనేజర్లు జ్వాలా చంద్రశేఖర్ రెడ్డి, గురునాథ్ రెడ్డిలపై కేసు ఫైల్ చేశారు ఉరవకొండ పోలీసులు. ఆడిట్‌లో అసలు బాగోతం బయటపడినా…ఎలాగోలా నకిలీ బంగారం ప్లేస్‌లో ఒరిజనల్ గోల్డ్ నగలు పెట్టి కవర్ చేయాలని ట్రై చేశారట. కానీ పుంగనూరు, పలమనేరులోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌లో 8 కోట్ల స్కామ్ బయటపడ్డంతో చివరాఖరకు పోలీసులను ఆశ్రయించారు. కనక దుర్గ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ హెడ్డాఫీస్ విజయవాడలో వుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 కేంద్రాల్లో కార్యకలాపాలు గోల్డ్ ఫైనాన్స్ నిర్వహిస్తోంది. పలమనేరు, పుంగనూరు, ఉరవకొండలో ఇంటి దొంగల చేతివాటం బయటపడింది. మరి మిగతా బ్రాంచ్‌ల్లోనూ ఇదే కథా?. కంపెనీకి మస్కా కొట్టి గిల్టు నగలతో కోట్లు కొల్లగొట్టడం వరకే దగా జరిగిందా? కస్టమర్లు తాకట్టు పెట్టిన ఒరిజినల్ నగలను కూడా గాయబ్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు పోలీసులు.. అటు కంపెనీ యాజమాన్యం ఆ దిశగా ఎంక్వయిరీ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.