Ugadi Celebrations: శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉగాది (Ugadi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Ys Jagan) దంపతులు హాజరయ్యారు. అంతకు ముందు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించి సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అస్థాన సిద్దాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శుభకృత్ నామ సంవత్సరం పేరుకు తగ్గట్లుగా ఈ ఏడాది కూడా అన్ని శుభాలే ఉంటాయని వెల్లడించారు. ప్రజల కోసం మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మరింత దగ్గరవుతారని సిద్ధాంతి తెలిపారు. ఈ ఏడాదిలో ఓర్పుగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతారని, ప్రజలకు మంచి పాలన అందిస్తారని సీఎం జగన్‌ను ఆశీర్వదించారు.