Ugadi 2022: వెంకన్న ఆలయంలో ముస్లిం భక్తుల సందడి.. ఉగాదికి అల్లుడిని ఆహ్వానిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
Ugadi 2022: శ్రీ శుభకృత్(Subhakritu) నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మనదేశం అనేక మతాలు అనేక ఆచారాల నిలయం. ఇక్కడ జరుపుకునే కొన్ని..
Ugadi 2022: శ్రీ శుభకృత్(Subhakritu) నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మనదేశం అనేక మతాలు అనేక ఆచారాల నిలయం. ఇక్కడ జరుపుకునే కొన్ని పండుగలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనాలు. అలాంటి పండుగలలో ఒకటి ఉగాది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కడప(Kadapa) లో జరిగే ఉగాది వేడుకలు హిందూ-ముస్లింల సఖ్యతకు వేదిక. కొన్ని ఏళ్లగా కడపలోని ముస్లింలు తెలుగువారి తొలి ఏడాదిని ఘనంగా జరుపుకుంటారు. తిరుమల వెంకన్న గడప.. కడపలోని వెంకన్న ఆలయం. ఆనవాయితీగా కోనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయానికి వేకువజాము నుంచే ముస్లిం భక్తుల భారీ సంఖ్యలో చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. దీంతో ఈ అలయం ముస్లిం భక్తులతో కిట కిటలాడింది. ప్రతీ ఏటా ఉగాది పర్వదినాన స్వామి వారిని ముస్లింలు దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి బత్యం సమర్పించారు ముస్లిం భక్తులు. స్వామి వారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాదు వెంకన్నకు ఉప్పు, పప్పు, చింతపండు సమర్పించారు.
చారిత్రక నేపథ్యం: ముస్లింలు కడపలోని శ్రీ లక్ష్మి వెనకటేశ్వర స్వామీ ఆలయంలో పూజల వెనుక చారిత్రక నేపథ్యముంది. వెంకన్న .. ముస్లింల ఆడబడుచు బీబీ నాంచారిని వివాహం చేసుకున్నారు. దీంతో హిందూ-ముస్లింలకు బంధుత్వం ఏర్పడిందని కడప ముస్లింల నమ్మకం. అందుకనే ఇక్కడ ముస్లింలు.. వేంకటేశ్వరస్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు. ఉగాది రోజు ప్రత్యేకంగా వెంకన్న ఆలయానికి వెళ్లి తమ అల్లుడిని పండుగకి ఇంటికి ఆహ్వానిస్తారు. ఉప్పు, పప్పు, చింతపండు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఈ ఆలయానికి కడప జిల్లా నుంచి మాత్రమే కాదు.. చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా ముస్లింలు తరలివస్తారు. ఆలయంలో ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే ఈ ఆలయంలో ఉగాది రోజున హిందూ భక్తుల కంటే కూడా ముస్లిం భక్తులే ఎక్కువగా కనిపిస్తారు.
Also Read: Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం