Ap Curfew: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ ఆంక్షలు, వ్యాక్సినేషన్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే సోమవారం కోవిడ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కర్ఫ్యూ సడలింపు పై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విధిస్తున్న కర్ఫ్యూ ఆంక్షలు బుధవారంతో ముగియనుంది. ప్రస్తుతం 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షల నుంచి సడలింపు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇక కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న ఐదు జిల్లాల్లో ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంది.
ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ నిబంధనలపై సమీక్షించనున్నారు.
కాగా, రాష్ట్రంలో క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..నిన్నటి కరోనా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 3,175 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్‌తో కొత్తగా 29 మంది మృతి చెందగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 12,844 ఉంది. మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,02,923 ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 3.3 శాతంగా ఉంది. మరణాల రేటు 0.67 శాతం, రికవరీ రేటు 97.5 శాతంగా ఉంది.