
అప్పటివరకు చలాకీగా ఉంటున్నవారు… ఒక్కసారిగా చతికలబడుతున్నారు…! ఆహ్లాదంగా పొలం పనులు చేసుకుంటూ గడిపే గట్టిమనుషులు… చిన్నపాటి జ్వరాలకే చిక్కిపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్తున్నారూ… ఇంటికి శవమై తిరిగొస్తున్నారు..! ఒకవేళ ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికొచ్చినా… కొన్నాళ్లకే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇదీ గుంటూరుకు కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్థుల పరిస్థితి…! రెండు నెలలుగా కారణం తెలియని 30 మరణాలతో దారుణమైన దుస్థితి.
ఇక హెల్త్ రిపోర్టులు చూస్తే నార్మల్‌గానే ఉంటున్నాయ్. అసలేంటీ దారుణం అంటే… బొడ్రాయి మీద నేరం మోపుతున్నారు ఊరి పెద్దలు. దక్షిణ దిక్కులో ప్రతిష్టించిన గౌటు రాయి కొద్దిగా పక్కకు ఒరగడంతోనే అరిష్టం జరుగుతోందని చెబుతున్నారు.
ఇటు ఇంకోరకమైన మూఢనమ్మకాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దుష్టశక్తులొచ్చాయ్… పొరమేరల్లో కాచుకుని కాటేస్తున్నాయన్న ప్రచారమూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో శాంతిపూజలు చేయాలని కొందరు… హోమం చేయాలని ఇంకొందరు… ఓ ఇలా ఒక్కటేంటి రకరకాలుగా ఆలోచనలు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఆరుబయట మనిషి జాడ లేకుండా అయిపోయింది.
ఇక వైద్యాధికారులు వాళ్ల పనివాళ్లు చేసుకుంటూ పోతున్నారు. ఇళ్లూ ఇళ్లూ తిరిగి ఆరా తీస్తున్నారు. సిబ్బంది టెంట్లు వేసుకుని మరీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అయినా ఏం జరుగుతోందన్న మిస్టరీకి మాత్రం తెరపడలేదు. కొన్ని రకాల పరీక్షలు చేసి మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియానే కారణమన్నా… అదీ నిజం కాదన్న విషయం తేలిపోయింది. అయితే ఇలా వారంరోజులుగా నడుస్తున్న ఈ మిస్టరీకి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎంట్రీతో ఎండ్ కార్డ్ పడినట్లైంది.
తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ పర్యటించడం… వైద్యులతో సమీక్షించడం… రిపోర్టులన్నీ పరీక్షించడం… అత్యుత్తమ వైద్యులతో సంప్రదింపులు జరపడంతో వరుస మరణాలకు కారణం బొడ్రాయి కానేకాదు… మెలియాయిడోసిస్ బ్యాక్టీరియాకి సంబంధమే లేదని తేలిపోయింది. మరేదో బ్యాక్టిరీయా ఊరిని పీడిస్తోందని… అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాధి ప్రబలడానికి ఓ కారణమని తేల్చారు మంత్రి. అంతేకాదు… ఎక్కడ నిర్లక్షం జరిగిందో తెలుసుకోవడానికి ఓ కమిటీని సైతం నియమించారు.
ఇటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఊరిలో పర్యటించారు. అపోహలొద్దన్నారు. ఇదేదో రేర్ డిసీజ్‌లా ఉందన్నారు. అధికారులను అప్రమత్తం చేశారు. వరుస మరణాలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక వణికిపోతున్న జనాల్లో ధైర్యాన్ని నింపారు. సో బొడ్రాయి కాదు… దుష్టశక్తులు లేవ్… త్వరలోనే మరణాలకు కారణాలేంటో తేలుస్తామంటున్నారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..