Post Office: పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఏంటో తెలుసా?

| Edited By: Subhash Goud

Nov 30, 2024 | 7:53 AM

Post Office: రాష్ట్రమంతా పొస్టాఫీసులకు మహిళలు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో అకౌంట్ లేనివారే తెరవాలన్నా సూచన దుష్ప్రచారంగా మారింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునే లబ్ధిదారులందరూ పోస్టాఫీసు..

Post Office: పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఏంటో తెలుసా?
Follow us on

తపాలా శాఖ పోస్టాఫీస్ లు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. పొదుపు ఖాతాల కోసం, ఆధార్ అనుసంధానం కోసం మహిళలతో పోటెత్తుతున్నాయి. సంక్షేమ ఫలాలు అందాలంటే తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉండాలన్న ప్రచారంతో తిరుపతి పోస్టాఫీస్ మరో జాతరను తలపిస్తోంది. పోస్టాఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలన్న సూచన ఇప్పుడు మహిళల లబ్ధిదారుల్లో ఆందోళన కు కారణమైంది.

రాష్ట్రమంతా పొస్టాఫీసులకు మహిళలు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో అకౌంట్ లేనివారే తెరవాలన్నా సూచన దుష్ప్రచారంగా మారింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునే లబ్ధిదారులందరూ పోస్టాఫీసు ల వద్ద బారులు తీరేందుకు కారణం అయ్యింది. ఇలా తిరుపతిలో రెండు రోజులుగా హెడ్ పోస్టాఫీసు వద్ద పెద్ద జాతర నే నడుస్తోంది. ఇందుకు కారణం సరైన సమాచారం లేకపోవడమేనని తెలుస్తోంది. ఇప్పటివరకు బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు లేని వారు, ఖాతా ఉన్న ఆధార్ తో అనుసంధానం చేయక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోలేక పోతున్న వారు దగ్గరలోని పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలన్న మౌలిక ఆదేశాలతో మహిళలు తపాలా శాఖ కార్యాలయాల బాట పడుతున్నారు. వార్డు, గ్రామ సచివాలయాలకు అందిన అధికారుల మౌలిక ఆదేశాలే ఇందుకు కారణం కాగా మహిళలు పెద్ద ఎత్తున తపాలా శాఖ కార్యాలయాలకు వస్తుండడం జాతరను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయం పక్కనే ఉన్న హెడ్ పోస్టాఫీసు వద్ద ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడక్కడ మరో జాతర జరుగుతోందేమోనన్నట్టుగా రెండ్రోజులుగా పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలు పొందాలంటే పోస్టాఫీసు ల్లో ఖాతా, ఆ ఖాతా ఆధార్ తో అనుసంధానం చేసుకొని తీరాల్సిందేనన్న సూచన తో పరుగులు పెడుతున్న మహిళలు బారులు తీరుతున్నారు. రూ.200 చెల్లించి తమ పేరు తో ఖాతా తెరిచేందుకు పిల్లలను వెంటబెట్టుకుని పోస్టాఫీసులకు చేరుకుంటున్నారు. రోజులు, గంటలు తరబడి నిరీక్షిస్తున్నారు. పోస్టాఫీస్ వద్ద బారులుతీరుతున్న వేలాదిమంది మహిళల కోసం ఏకంగా కౌంటర్లను బయట ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్న సిబ్బంది నానా అగచాట్లు పడుతున్నారు.

అయితే ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారికి కొత్తగా పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పని లేదన్న సమాచారంపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఖాతాలు తెరవాల్సి ఉంటుందని భావిస్తున్న తపాలా శాఖ సరైన అవగాహన లేక పోస్టాఫీసులకు క్యూ కడుతున్న ఖాతాదారులతో ఇబ్బందులు పడుతున్నారు. పోస్టాఫీసుల్లో ఖాతాలు ఉంటే NPCI తో అనుసంధానం చేసుకోవాలన్న సూచనే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడంతోనే పోస్టాఫీసులకు లబ్దిదారులు వస్తున్నారని భావిస్తున్న తపాలా శాఖ అధికారులు ఇందులో తమ తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి