సైబర్ క్రైమ్స్‌పై ఉక్కుపాదం..! వచ్చే శాసన సభా సమావేశాల్లో చట్ట సవరణ బిల్లు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ, రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు చట్ట సవరణ బిల్లును త్వరలో ప్రవేశపెట్టనుంది. బెట్టింగ్, లోన్ యాప్స్ వంటి మోసాలను అరికట్టడం, రూ. 30,000 కోట్లకు పైగా నష్టం జరుగుతున్న సైబర్ క్రైమ్స్ నియంత్రణపై దృష్టి పెట్టారు.

సైబర్ క్రైమ్స్‌పై  ఉక్కుపాదం..! వచ్చే శాసన సభా సమావేశాల్లో చట్ట సవరణ బిల్లు
Cyber Crime

Edited By:

Updated on: Jul 20, 2025 | 11:06 AM

సైబర్ క్రైమ్స్ పై ఉక్కుపాదం మోపే విధంగా ప్రస్తుతం ఉన్న చట్టానికి మరింత పదును పెట్టే విధంగా వచ్చే శాసన సభా సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ. ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు ఈ విషయం స్పష్టం చేశారు. పటిష్టమైన చట్ట రూపకల్పనకు హోం, ఐటి శాఖ కార్యదర్శలతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చించింది.

రాష్ట్రంలో జరుగుచున్న సైబర్ క్రైమ్స్ నియంత్ర్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు ఆదేశాలు జారి చేశారు. వారి ఆదేశాల మేరకు ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల రాష్ట్రంలోని ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, వీటికి సంబందించి కేవలం 4 శాతం కేసులు మాత్రమే రిజిస్టరు అయ్యాయి, మొత్తం రూ.960 కోట్లు మేర మోసం జరిగింది, ఇందులో రూ.300 కోట్ల వరకూ రికవరీ చేశారు. ఈ లెక్కన ఏడాది దాదాపు రూ.30 వేల కోట్ల వరకూ సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నట్లు అంచనా.

మోస పూరిత యాప్స్ ను రూపొందించే వారిపై, సిస్టమ్స్ లో వాటిని లోడ్ చేసేవారిపై కేసులు పెట్టే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం లేకపోవటంతో ఆ చట్టానికి సవరణ చేయడం ద్వారా గ్రాస్ రూట్ లెవివ్ లో క్రైమ్ సిండికేట్ మొత్తాన్ని నియంత్రించే విధంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు సంబందించి సమగ్రమైన నివేదికను తమ కమిటీ త్వరలో శాసన సభ స్పీకర్ కు నివేదిదించనుంది. డిజిటల్ అరెస్టు చేసినట్లు మోసపూరితమైన కాల్స్, సందేశాలు రావడం వల్ల ఎంతో మంది అమాయకులు భయబ్రాంతులకు గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సంఘటనలు సమాజంలో చోటు చేసుకున్నాయి. అసలు డిజిటల్ అరెస్టు అనే విధానమే లేదని, ఇటు వంటి మోసపూరితమైన కాల్స్, సందేశాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పదేపదే అవగాహన కార్యక్రమాలు జరిగిన మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇటు వంటి మోసాలకు సంబందించిన సమాచారాన్ని 1930 కు వెంటనే ఫిర్యాదు చేసినట్లైతే తక్షణ చర్యలు తీసుకుంటారు. 40 మంది ఆపరేటర్లు మూడు షిప్టుల్లో పనిచేసే విధంగా సీఐడీ శాఖ కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులతో పలు మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఏడాది కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ ను పూర్తి గా అరికట్టే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలనేది ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. వాట్సాప్ గవర్నెన్సు కూడా ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంది, లక్ష్యానికి మించి దాదాపు 10 లక్షల ట్రాన్జాక్షన్స్ ఈ వాట్సాప్ గవర్నెన్సు ద్వారా జరుగుతున్నాయి. ఈ ప్లాట్ ఫార్ము ద్వారా కూడా సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నారు.

ముఖ్యంగా నాలుగు రకాలైన సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. తక్కువ వడ్డీ రుణాల యాప్స్, బెట్టింగ్ యాప్స్, కాల్ సెంటర్ల ద్వారా పోర్ను వీడియోలు, లింకులు పంపించడం, బ్యాంక్ ఓటిపి లను అడగం ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఇటు వంటి నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే ప్రజలు కూడా వీటి విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరస్తుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి