
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని.. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి మలక్కా జలసంధి – దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం 0830 గంటలకు (నవంబర్ 24, 2025) మలేషియా, మలక్కా జలసంధి ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుభంద ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ బాగా గుర్తించబడిన అల్పపీడనం నవంబర్ 25, 2025న పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా మరింతగా కదులుతూ, తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది.
నిన్నటి కొమోరిన్ – పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనము ఈరోజు అనగా నవంబర్ 24, 2025 ఉదయం 08.30 గంటలకు అదే ప్రాంతములో కొనసాగుతున్నది. దీని ప్రభావంతో, నవంబర్ 25వ తేదీ నాటికి కొమోరిన్ – దాని పరిసర నైరుతి బంగాళాఖాతం – శ్రీలంక ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి మరింతగా గుర్తించబడే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ:- మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..