Bogus Challan Scam: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీలు.. కోట్లలో కొల్లగొడుతున్న అధికారులు.. వెలుగు చూసిన భారీ స్కామ్..

|

Aug 13, 2021 | 2:06 PM

ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అసలేం జరుగుతోంది? కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది ఎవరు? ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతోన్న అవినీతి వెనుక...

Bogus Challan Scam: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీలు.. కోట్లలో కొల్లగొడుతున్న అధికారులు.. వెలుగు చూసిన భారీ స్కామ్..
Kurnool Sub Registrar
Follow us on

ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అసలేం జరుగుతోంది? కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది ఎవరు? ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతోన్న అవినీతి వెనుక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీ స్కామ్ బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఇది బయటపడింది. సాఫ్ట్ వేర్ లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కేటుగాళ్లు ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండికొడుతున్నారు.

ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. నకిలీ చలానాలతో కోట్లు కొట్టేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఫేక్ చలానాల భాగోతం బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు. CFMSలోని లోపాలే ఆసరాగా కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు.

సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుంటోన్న కేటుగాళ్లు ఈ-చలానాలను దారి మళ్లిస్తున్నారు. CFMS, ఈ-చలానా, EC, RH , నకళ్లును సీనియర్ అసిస్టెంట్లు చేయాల్సి ఉండగా… ఈ పనులను ప్రైవేట్ రైటర్స్‌తో చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ దందా వెనుక సబ్ రిజిస్ట్రార్లే సూత్రధారులుగా ఉన్నారే ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు కేవలం పాత్రధారులేనన్న మాట వినిపిస్తోంది.

కడప జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ బోగస్ చలానాల మోసం బయటపడింది. దాంతో, ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు క్లర్క్ లపైనా వేటు పడింది. ఫేక్ చలానాలతో కోటీ రూపాయలకు పైగా స్వాహా చేసినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు. కడప అర్బన్ సబ్ రిజిస్ట్రార్లు చంద్రమోహన్, సుబ్బారెడ్డి, అసిస్టెంట్ రత్నమ్మ… అలాగే కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణ, అసిస్టెంట్ సుకుమార్ ను విధుల నుంచి తప్పించారు.

కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. సబ్ రిజిస్ట్రార్ సోఫియా బేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్నను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నకిలీ చలానాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు తేలడంతో విధుల నుంచి తొలగించారు. బోగస్ చలానాలతో అక్రమాలకు పాల్పడిన ఆరుగురు స్టాంప్ రైటర్లపై కేసు నమోదు చేశారు.

విజయనగరం జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయి. గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో బోగస్ చలానాలతో కోట్లు కొట్టేసినట్లు తనిఖీల్లో తేలింది. పెద్దమొత్తంలో డబ్బు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్సే కీలక సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఉన్నతాధికారుల దాడులతో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్లు ముందే జాగ్రత్త పడుతున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణ తెలివిగా డాక్యుమెంట్ రైటర్స్ పై రివర్స్ లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఈ-చలానాలతో అక్రమాలకు పాల్పడ్డారంటూ ముగ్గురిపై కంప్లైంట్ ఇచ్చారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అవినీతి అక్రమాలు పెద్దఎత్తున బయటపడుతున్నాయి. పాత్రధారులుగా డాక్యుమెంట్ రైటర్స్ కనిపిస్తున్నా… సూత్రధారులు మాత్రం సబ్ రిజిస్ట్రార్స్, అధికారులేనన్న మాట వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..

Horoscope Today: ఈరాశుల వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..