ఉద్యోగానికి రాజీనామా చేసి స్కూల్ నుండి వెళ్లిపోతున్న టీచర్ కు ఊహించని ఘటన ఎదురైంది. తమను, తమ స్కూల్ ను వదిలి వెళ్ళొద్దంటూ టీచర్ ను అడ్డుకొని భోరున విలపించారు విద్యార్థులు. అనుకోకుండా ఎదురైన ఈ ఘటనతో టీచర్ ఒక్కసారిగా ఖంగుతింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం బూడివీధి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామభద్రపురం బూడివీధి ప్రభుత్వ పాఠశాలలో కె. విజయగౌరీ అనే మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.
సుమారు ముప్పై ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన విజయగౌరీ అనేక ప్రభుత్వ పురస్కారాలు, అవార్డులు, రివార్డులు పొందారు. అంతేకాకుండా ఈమె ఉపాధ్యాయ సంఘ నాయకురాలిగా కూడా చురుకైన పాత్ర పోషిస్తుంటారు. నిరంతరం ఉపాధ్యాయుల సమస్యల పై పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలోనే మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు పోటీకి సిద్ధమయ్యాయి. అందులో భాగంగా యూ టి ఎఫ్ బలపరిచిన పిడిఎఫ్ సంఘం తరుపున విజయగౌరీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అందుకోసం ఆమె పనిచేస్తున్న హెడ్మాస్టర్ ఉద్యోగానికి ఆరేళ్ల సర్వీస్ ఉండగా ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అలా ఆమె రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో తన ఆఖరి రోజు స్కూల్ కి వెళ్లి తన తోటి సిబ్బందికి చివరిగా కలిసి వారి వద్ద నుండి వీడ్కోలు తీసుకొని ఇంటికి బయలుదేరింది. అలా వెళ్తుండగా స్కూల్ ప్రాంగణంలో ఆ స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున విజయగౌరీని చుట్టుముట్టారు.
ఆమెను గట్టిగా పట్టుకొని పెద్దగా రోదిస్తూ మేడమ్? మీరు మమ్మల్ని వదలివెళ్లొద్దు ప్లీజ్ అంటూ ఒక్కసారిగా రోధించారు. విజయగౌరీ వారిని ఎంత ఓదార్చినా వారు మాత్రం తమ కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఇదంతా చూసిన విజయగౌరీకి కూడా కన్నీరు ఆగలేదు. విద్యార్థులతో పాటు విజయగౌరీ కూడా కన్నీటి పర్యంతం అవ్వడంతో స్కూల్ ఆవరణంతా అలజడిగా మారింది. చివరికి విజయగౌరీ తేరుకుని విద్యార్థులను ఓదార్చింది. తను తరుచూ స్కూల్ కి వస్తానని, మిమ్మల్ని అందరినీ కలుస్తానని, మీరు భాధ పడవద్దని, ఎమ్మెల్సీ అయ్యి స్కూల్ ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పడంతో విద్యార్థులు తమ ఏడుపును కొంత అదుపు చేసుకున్నారు.
స్కూల్ లో విజయగౌరీ విద్యార్థులతో స్నేహభావంగా వ్యవహరించేది. వారికి పాఠాలతో పాటు చిత్రలేఖనం, ఆటలు, పాటలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సరదా సరదాగా గడిపేది. అలా విజయగౌరి పై విద్యార్థులు కూడా తెలియకుండానే అభిమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో విజయగౌరి స్కూల్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుందని తెలిసి విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే అంశం ఇప్పడు నెట్టింట వైరల్ అవుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి