Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఈ జిల్లాలోనే నిర్మాణం.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్ రానుంది. రాష్ట్రంలో ఏడు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా కాకినాడలో కొత్త ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇప్పటికే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది.

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఈ జిల్లాలోనే నిర్మాణం.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
Airport

Updated on: May 06, 2026 | 11:45 AM

ఏపీలో ఇప్పటికే అనేక జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా.. ఇప్పుడు మరికొన్ని జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా కాకినాడ జిల్లాలో ఎయిర్‌పోర్ట్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక్కడ నూతన నిమానాశ్రయం నిర్మాణంపై ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒక నివేదిక సమర్పించాలని అధికారులను కోరింది. దీంతో జిల్లా అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎయిర్‌పోర్ట్ సాధ్యాసాధ్యాలపై ఒక రిపోర్ట్ అందించనున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయనున్నారు. తుని-అన్నవరం మధ్య ఈ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని అధికారులు భావిస్తుున్నారు.

కొత్తగా ఏడు ఎయిర్‌పోర్ట్‌లు..

ఏపీలో కొత్తగా ఏడు ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా కాకినాడ జిల్లాలో తుని-అన్నవరం మధ్య ఎయిర్‌పోర్ట్ కోసం ప్రతిపాదనలు సిద్దం చేశారు. తొలుత పాయకరావుపేట-తుని మధ్య నిర్మించాలని భావించారు. ఆ తర్వాత ప్రతిపాదనలు మార్చి తుని-అన్నవరం మధ్య స్థలం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్‌కు సంబంధించిన అంశంపై సమగ్ర నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ సాధ్యాసాధ్యాలు, భూముల లభ్యత, రోడ్డు, కరెంట్, వాటర్ లాంటి ఇతర మౌలిక సదుపాయాల గురించి వివరాలు ఇవ్వాలని కోరింది. అలాగే సర్వే నెంబర్లు, రికార్డులు వంటి వివరాలు అందించాలని సూచించింది. త్వరలోనే అధికారులు క్షేత్రస్దాయిలో పర్యటించి నివేదిక సమర్పించనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే.. కాకినాడ పోర్ట్ నుంచి సరుకు రవాణాలో వేగం పెరగనుంది. ఎయిర్ కార్గో ద్వారా ఇతర ప్రాంతాలకు సులువుగా ఎగుమతులు చేయవచ్చు. అటు కాకినాడ జిల్లాతో పాటు ఒంగోలు, పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద ఏర్పాటు నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని డెడ్ లైన్ పెట్టుకుంది.

జూన్‌లో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం

ఇక జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించేందుకు సర్వం సిద్దమవుతోంది. ఇప్పటికే పనులన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. దీంతో ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో ట్రయల్ రన్ నిర్వహించగా.. అది సక్సెస్ అయింది. ట్రయల్ రన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి విమానం భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. ఇందులో కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు ప్రయాణించారు. విశాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌కు సులువుగా చేరుకునేలా రోడ్లు కూడా నిర్మించారు.

Follow Us