AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరించిపోయింది అనుకుంటే మన ఏపీలో కనిపించింది..

తెలుగు రాష్ట్రాలలో కనిపించే అరుదైన "ఘోస్ట్ పక్షి" జెర్డాన్స్ కౌర్సర్ గురించి తెలుసా? అంతరించిపోయిందని భావించిన ఈ పక్షి 1986లో తిరిగి కనుగొనబడింది. ఇది రాత్రివేళల్లో చురుకుగా ఉండి, ఎగరకుండా నేలపై పరిగెత్తుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పొదలు, రాతి ప్రాంతాలలో నివసిస్తూ, ఇది ప్రస్తుతం తీవ్ర అంతరించిపోతున్న జాతులలో ఒకటి. దీని ప్రత్యేకతలు ఆసక్తికరమైనవి.

అంతరించిపోయింది అనుకుంటే మన ఏపీలో కనిపించింది..
Jerdons Courser
Ram Naramaneni
|

Updated on: May 07, 2026 | 5:52 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కనిపించే అత్యంత అరుదైన పక్షుల్లో ఒకటి జెర్డాన్స్ కౌర్సర్. దీనిని “ఘోస్ట్ పక్షి” అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో చాలా పరిమిత ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ పక్షి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప పరిసరాల్లోనే నమోదైంది. ఒకప్పుడు ఇది అంతరించిపోయిందని భావించినా, 1986లో మళ్లీ కనుగొనబడటం పక్షిశాస్త్ర ప్రపంచంలో గొప్ప పరిణామంగా నిలిచింది. 2004లో చివరిసారి దాని ఉనికి గుర్తించారు. ఆపై రెండు దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. అత్యంత అరుదైన జెర్డాన్స్ కోర్సర్ పక్షి మరోసారి ప్రత్యక్షమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో, దానికి తెలిసిన ఏకైక ఆశ్రయమైన శ్రీలంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంకు చాలా దూరంలో ఉన్న పొద అడవులలో, తీవ్రంగా అంతరించిపోతున్న ఈ పక్షిని 2025 ఆగస్టులో గుర్తించారు.

జెర్డాన్స్ కౌర్సర్ రాత్రిపూట చురుకుగా ఉండే పక్షి. ఇది ఎగరగలిగినా, ఎక్కువగా నేలపై వేగంగా పరిగెత్తడం ద్వారా సంచరిస్తుంది. పొదలు, రాళ్లతో కూడిన పొడి అటవీ ప్రాంతాలు దీనికి ఇష్టమైన నివాసం. పురుగులు, కీటకాలు దీని ప్రధాన ఆహారం. చాలా నిశ్శబ్దంగా ఉండే ఈ పక్షి దగ్గరలో ఉన్నా కూడా దాని ఉనికిని గుర్తించడం చాలా కష్టం. ఈ పక్షి సాధారణంగా నేలపైనే ఒకటి లేదా రెండు గుడ్లు పెడుతుంది. సుమారు 15 నుంచి 20 రోజులలో పిల్లలు బయటకు వస్తాయి. గోధుమరంగు మచ్చలతో ఉండే దీని శరీరం, కళ్ల చుట్టూ తెల్లటి వలయం, పొడవాటి కాళ్లు ప్రత్యేక లక్షణాలు.

ప్రకృతి సంరక్షణ అంతర్జాతీయ సంఘం ప్రకారం ప్రస్తుతం ఈ పక్షి తీవ్ర అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించబడింది. ఖచ్చిత సంఖ్య తెలియకపోయినా, దీని సంఖ్య చాలా తక్కువగా ఉందని అంచనా. ముఖ్యంగా ఆవాసాల నష్టం, మానవ జోక్యం వంటి కారణాలతో ఈ అరుదైన జాతి తీవ్రమైన ప్రమాదంలో ఉంది. మొత్తంగా, జెర్డాన్స్ కౌర్సర్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకమైన అమూల్యమైన సహజ సంపద. దీనిని సంరక్షించడం మన అందరి బాధ్యత.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us