వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండ్రోజుల పాటు ఈ రూట్ క్లోజ్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే
Vijayawada Bypass Traffic Alert: విజయవాడ బైపాస్ గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఈ బైపాస్‌పై నుంచి 21, 22 తేదీల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఉంటుందని తెలిపారు. అంబాపురం హైటెన్షన్ విద్యుత్ టవర్ల మరమ్మతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

విజయవాడ బైపాస్‌పై నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ఇదో బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే నవంబర్ 21 శనివారం, 22 ఆదివారం రెండు రోజుల పాటు బైపాస్ రోడ్డుపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుందని పోలీసులు తెలిపారు. విజయవాడ బైపాస్ పరిధిలోని అంబాపురం హైటెన్షన్ విద్యుత్ టవర్ల మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో బైపాస్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ పనులు రెండు రోజుల పాటు జరిగే ఛాన్స్ ఉందని.. అప్పటి వరకు ఈ రూట్‌లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఏలూరు వైపు నుంచి విజయవాడ బైపాస్ ద్వారా హైదరాబాద్, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు.. చినఆవుటపల్లి నుంచి రామవరప్పాడు, బెంజ్‌సర్కిల్ వరకు వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి గుంటూరు వెళ్లేవారు వారధి మీదుగా, హైదరాబాద్ వెళ్లేవారు బస్టాండ్ మీదుగా వెళ్లాలని సూచించారు.
ప్రత్యామ్నాయ రూట్లు ఇవే:
ఇక గుంటూరు, హైదరాబాద్ వైపు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు గొల్లపూడి నల్లకుంట రింగు నుంచి గొల్లపూడి వై-జంక్షన్, సీవీఆర్ పైవంతెన, పైపుల రోడ్డు, నున్న పవర్‌గ్రిడ్ మీదుగా విజయవాడ చేరుకోవాలని సూచించారు. అలాగే మైలవరం నుంచి విజయవాడ వచ్చే వాహనాలు పాములకాలువ సెంటర్ నుంచి అంబాపురం, పి.నైనవరం, పాములకాలువ మీదుగా వై.వి.రావు ఎస్టేట్ మీదుగా వెళ్లాలని సూచించారు. అదే విజయవాడ నుంచి మైలవరం వైపు వెళ్లే వారు వై.వి.రావు ఎస్టేట్ నుంచి పాములకాలువ, షాబాద్ అండర్‌పాస్ నుంచి కొత్తూరు తాడేపల్లి రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
