ధర్మవరం, సెప్టెంబర్ 21: వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిన భయపెడుతోంది హార్ట్ ఎటాక్. ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముదుసలి వరకు వయోభేదం లేకుండా ఈ మధ్యకాలంలో హఠాత్తుగా ఎందరి గుండెలు ఆగిపోయాయో లెక్కేలేదు. కళ్ల ముందు హుషారుగా ఉన్న వారు క్షణాల్లో విగత జీవులుగా మారుతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ.. అంతెందుకు రోడ్డుపై నడుస్తున్న వారు ఆకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు ఒదులుతున్నారు. దీంతో చిట్టి గుండె ఎప్పుడు ఎలా స్పందిస్తుందో తెలియక జనాలు బెంబేలెత్తి పోతున్నారు. తాజాగా ఓ యువకుడు వినాయక చవితి సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి పోయాడు. నిండా ముప్పై ఏళ్లు కూడా లేని యువకుడు కళ్ల ముందే ప్రాణాలు ఒదలడంతో గుండెలవిసేలా విలపించారు తల్లిదండ్రులు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరం పట్టణంలో చోటు చేసుకుంది.
ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్ లో వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ (26) అనే యువకుడు మృతి చెందాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ప్రసాద్ ను హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అయితే అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది.
వినాయక చవితి సందర్భంగా ప్రసాద్ ఇంటి ముందే స్థానికులు మండపం ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా మృతుడు ప్రసాద్ మండపంలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రసాద్ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. హుటాహుటీన స్నేహితులు, బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సంఘటన స్థలంలో గుండెపోటుకు గురై చనిపోయిన దృశ్యాలను స్నేహితులు సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. మృతుడు ప్రసాద్ భార్య గర్భిణీ కావడంతో ఆమెను ఓదార్చడం ఎవరీ వల్ల కావడం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.