Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని అనేక సందర్భాల్లో అంటుంటారు. అనటమే కాదు.. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది కూడా. తాజాగా అలాంటి సన్నివేశమే మరోటి సాక్షాత్కరించింది. బాధిత మహిళ అన్నా అంటూ సాయం అడగటమే ఆలస్యం.. నేనున్నానంటూ అభయం ఇచ్చారు. అభయం ఇవ్వటమే కాదు.. ఆమె కోరిన సాయాన్ని గంటలోపే అందేలా చేశారు. ఆమె ఆనందానికి కారణం అయ్యారు. సీఎం సాయం అందుకున్న ఆ తల్లి.. మనసున్న మారాజు మా జగనన్న అంటూ సంతోషంతో మురిసిపోయింది.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాయకరావు పేటలో వివాహ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ సందర్భంగా మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఒక బాలుడిని తీసుకుని ఓ తల్లి సీఎం జగన్‌ను కలిసింది. ఆ చిన్నారిని, ఆ తల్లి పరిస్థితిని చూసి చలించిపోయిన సీఎం జగన్.. సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే.. బాధిత మహిళకు తక్షణ ఆర్థిక సహాయం, బాలుడికి వికలాంగ పింఛను మంజూరు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనం అయ్యారు. సీఎం అలా హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే కలెక్టర్ శుక్లా.. తల్లికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయడంతో పాటు..ఆ బాలుడికి వచ్చే నెల నుండి వికలాంగ పించను అందేలా ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాలుడికి రూ. 35 వేల విలువైన వీల్ చైర్ ఇప్పించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..