Jagananna Housing Scheme: ఇళ్లు లేని పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ఫ్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ మెంట్) పూర్తి స్వచ్చందమని.. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు, లబ్ధి చేకూరుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ బిల్డింగ్‌లో బుధవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఈ పథకం లక్ష్యాలను వివరించారు. డిసెంబర్ 8 నుంచి రిజిస్ట్రేషన్ పక్రియ మొదలు అవుతుందని, డిసెంబర్ 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.
హౌసింగ్ కార్పోరేషన్ లో దాదాపు 39 లక్షల మంది డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారని, వారిలో గ్రామీణ ప్రాంతంలో వారు 34లక్షల మంది, పట్ణణ ప్రాంతంలో 5లక్షల మంది ఉన్నారని అజయ్ జైన్ తెలిపారు. వారికి ఇళ్లు, స్థలాలు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి, కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి ఎటువంటి అధికారం ఉండదన్నారు. 39 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ కు దాదాపు రూ.14 వేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉందని తెలిపారు. 2000 నుంచి 2014 వరకూ వన్ టైం సెటిల్ మెంట్ కింద కేవలం వడ్డీని మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అలాంటి పథకం ఏమైనా తీసుకొస్తే బాగుంటుందని ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయని.. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి సెప్టెంబర్ నెలలో కేబినెట్ లో చర్చించి ఈ పథకాన్ని ఆమోదించారని అజయ్ జైన్ తెలిపారు.
పట్టా తీసుకున్న వారు, ఇల్లు కట్టుకున్న వారు.. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లలో రూ.20వేలు చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుందని అజయ్ జైన్ తెలిపారు. లబ్ధిదారులకు ఎంత రుణం ఉన్నా.. వన్ టైం సెటిల్ మెంట్ కింద మిగిలిన రుణం ఎంత ఉన్నా మాఫీ అవుతుందన్నారు. వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ రిటర్న్ చేయడంతో పాటు రిజిస్టర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా లబ్ధిదారులకు పూర్తి హక్కులు వస్తాయన్నారు.
అలాగే, బ్యాంకుల్లో మార్ట్‌గేజ్ చేసి.. 75 శాతం వరకూ లోన్స్ తీసుకోవచ్చని తెలిపారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం కానీ, స్టాంప్ డ్యూటీ గానీ, యూజర్ ఛార్జీలు గానీ ఉండవని తెలిపారు. ఈ పథకం కింద గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. 22 (A) లో ఉన్నవాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీమ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి 22(A) జాబితా నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా భవిష్యత్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు సచివాయాల్లో 10 నిమిషాల్లో ఈ రిజిస్ట్రేషన్ పక్రియ అంతా పూర్తవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టా తీసుకుని.. హౌసింగ్ కార్పోరేషన్ నుండి ఎటువంటి రుణం తీసుకోని వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద కేవలం రూ.10తో రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ ను పొందవచ్చనన్నారు. దీని ద్వారా లబ్ధిపొందేవారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారన్నారు. ఇది పూర్తిగా స్వచ్చంద పథకమని, ఈ పథకంలోని ప్రయోజనాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పూర్తిగా కొత్త పథకమని,, ఈ పథకం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజల్లో అహగాహన కల్పించాలని ఆయన కోరారు.
వన్ టైం సెటిల్ స్కీం 24 జనవరి 2000లో ప్రారంభమైంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం వడ్డీ మాఫీ మాత్రమే ఇచ్చేది. రుణం చెల్లించిన తర్వాత తనఖా పెట్టుకున్న పత్రాన్ని తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేవారు. మార్చి 31, 2014 వరకు అంటే 14 సంవత్సరాల 2 నెలల కాలంలో 2,31,284 మంది వన్‌టైం సెటిల్ మెంట్ స్కీంను వినియోగించుకున్నారు. మొత్తం 56,69,000 మంది లబ్ధిదారులున్నారు.