Andhra Pradesh: ఆయన ఓ ఐఏఎస్ అధికారి.. ఎప్పుడూ ఏజెన్సీ ప్రజల్లో ఉండే ఆయన.. మరో అడుగు ముందుకేశారు. ఈసారి మారుమూల మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో పర్యటించేందుకు సాహసం చేశారు. రహదారి సౌకర్యం లేకపోయినా ఆ ప్రాంతంలో పర్యటించారు. గిరిజనుల అభ్యర్ధనతో కొంత దూరం గుర్రం పై ప్రయాణం చేసి.. ఆ తరువాత కాలి నడకన నడిచి వెళ్లారు. ఆ తర్వాత తమ గ్రామానికి తొలిసారిగా ఐఏఎస్ అధికారి రావడంతో సాదరంగా స్వాగతం పలికారు గిరిజనులు.
వివరాల్లోకెళితే.. విశాఖ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ. ఈసారి ఏకంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. ప్రజలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు పాడేరు కనెక్ట్ పేరుతో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు బయలుదేరారు. ఎప్పుడూ ఆ స్థాయి అధికారి సాహసం చేయని ప్రాంతమైన పెదబయలు మండలం గుంజి వాడలో పీవో గోపాలకృష్ణ పర్యటించారు.
ఇప్పటికీ ఏజెన్సీ మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేదు. ప్రాజెక్టు ఆఫీసర్‌గా గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పోలీసులతో కలిసి కొన్ని మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేయించారు. తాజాగా పాడేరు కనెక్ట్ పేరుతో మంజూరైన రోడ్లకు ప్రత్యేక చొరవతో అన్ని విధాలా లైన్ క్లియర్ చేశారు. అయితే ఈ రోజు రోడ్డు పనుల నిర్మాణాలను పరిశీలించేందుకు ఏజెన్సీ మారుమూల ప్రాంతాలకు బయలుదేరారు గోపాలకృష్ణ. పాడేరు నుంచి బయలుదేరి తన వాహనంలో వెళ్లారు. ముంచంగిపుట్టు మండలం బూసి పుట్టు నుంచి జామిగూడకు వాహనం పైన ప్రయాణం చేశారు. అక్కడి నుంచి రోడ్డు సదుపాయం సరిగా లేకపోవడంతో గుర్రంపై ఎక్కి ప్రయాణం చేశారు గోపాలకృష్ణ. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు గుర్రం పైన ప్రయాణించారు.
నడిచి వెళ్దామని చెప్పినా.. గిరిజనుల అభ్యర్థన మేరకు ఆయన గుర్రమెక్కారు. రెండు కిలోమీటర్ల మేర గుర్రంపై ప్రయాణించిన తర్వాత.. అక్కడ నుంచి మరో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. రహదారి పనుల పరిశీలనతో పాటు ఆ ప్రాంత గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనులతో మమేకమయ్యారు పిఓ గోపాలకృష్ణ.
ఐఏఎస్ స్థాయి అధికారి.. ఆ గ్రామానికి వెళ్లడం తొలిసారి. ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ తమ గ్రామానికి ధైర్యంతో వెళ్లి సాదకబాదకాలు తెలుసుకోవడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ గిరిజనులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. తమ గ్రామాలకు వచ్చినందుకు, రోడ్డు నిర్మాణం జరుగుతున్నందుకు పీవో కు కృతజ్ఞతలు తెలిపారు.
– ఖాజా, వైజాగ్, టీవీ9 తెలుగు.
Also read:
Telangana: తెలంగాణలో చేపలను ఎగుమతి చేసే కంపెనీ భారీ పెట్టుబడి.. సుమారు 5000 మందికి ఉపాధికి అవకాశాలు
కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..