AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఢిల్లీ ఆదేశాల కోసం వెయిటింగ్‌.. పొత్తుపై ఎటూ తేల్చని ఏపీ బీజేపీ..

BJP vs Janasena: ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించరు, ఊహించలేదు కూడా. కాకపోతే, ఓ చిన్న ఆశ. కేంద్ర బీజేపీ నుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయోమో, ఫలానా లీక్ ఇవ్వండని చెప్పారేమోనని ఓ చిన్న ఆశ. కాని, కోర్ కమిటీ సమావేశం తరువాత ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడిన మాటలు వింటే..

Andhra Pradesh: ఢిల్లీ ఆదేశాల కోసం వెయిటింగ్‌.. పొత్తుపై ఎటూ తేల్చని ఏపీ బీజేపీ..
Janasena Vs Bjp
Shiva Prajapati
|

Updated on: Oct 04, 2023 | 3:00 PM

Share

BJP vs Janasena: ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించరు, ఊహించలేదు కూడా. కాకపోతే, ఓ చిన్న ఆశ. కేంద్ర బీజేపీ నుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయోమో, ఫలానా లీక్ ఇవ్వండని చెప్పారేమోనని ఓ చిన్న ఆశ. కాని, కోర్ కమిటీ సమావేశం తరువాత ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడిన మాటలు వింటే.. పొత్తులపై హైకమాండ్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టంగా అర్థమైంది. కనీసం టీడీపీ-జనసేన పొత్తుపై రాష్ట్ర బీజేపీ ఏమనుకుంటుందో కూడా బయటపడనివ్వలేదు పురంధేశ్వరి. పవన్ కల్యాణ్ అభిప్రాయాలను హైకమాండ్‌కు చెబుతామని, తమ నిర్ణయం ఏంటన్నది కేంద్ర బీజేపీ పెద్దల నుంచే వస్తుందని చెప్పారు తప్ప.. రాష్ట్రం తరపున పొత్తుపై ఏమనుకుంటున్నామో చెప్పలేదు. మొత్తానికి కోర్‌ కమిటీ సమావేశాన్ని అలా ముగించారు.

మరోవైపు పవన్ కల్యాణ్ పొత్తులపై చాలా దూరం వెళ్లిపోయారు. ఇకపై బీజేపీ గురించి ఎదురుచూసే పరిస్థితి ఉండబోదనే క్లియర్‌ కట్ మెసేజ్ ఇచ్చారు జనసేనాని. 2024 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. అంటే.. బీజేపీ కలిసిరాకపోయినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.

పవన్‌ కల్యాణ్ గత వ్యాఖ్యలకు మొన్నటి వ్యాఖ్యలకు చాలా స్పష్టమైన తేడా కనిపించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో పవన్ నోటి నుంచి బీజేపీ ప్రస్తావన రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్డీయేతో పొత్తులో ఉంటూనే.. తమతో చర్చించకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటన చేయడమే ఏపీ బీజేపీకి పెద్ద షాక్. నిజానికి, ఈపాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. కాని, పొత్తుల వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందంటూ ఓ ప్రకటన చేసి.. ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. మరోవైపు.. క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన రెండూ కలిసి వెళ్తున్నాయి. టీడీపీ మీటింగ్‌ అయినా, జనసేన కార్యక్రమం అయినా రెండు పార్టీల జెండాలూ, కార్యకర్తలు కనిపిస్తున్నారు. ఎటొచ్చీ బీజేపీ జెండానే కనిపించడం లేదు. ఇదే కంటిన్యూ అయితే గనక.. ఏ ప్రయోజనం కోరి ఏపీలో జనసేనను కలుపుకొని వెళ్తున్నామో అది నెరవేరడం కష్టమని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. అయినా సరే.. పొత్తులపై రాష్ట్ర బీజేపీ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకురావడం లేదు. కనీసం పొత్తు లేదని చెప్పినా ఎవరి దారి వారు చూసుకోవచ్చు కదా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కాని, ఇప్పట్లో ఈ విషయం తేల్చేలా కనిపించడం లేదు. దాదాపుగా ఎన్నికల ముందే బీజేపీ తన నిర్ణయం చెప్పేలా కనిపిస్తోంది. లేదంటే, చంద్రబాబు కేసుల విషయంలో ఏదైనా పాజిటివ్ వార్త వచ్చి, మళ్లీ ఆపార్టీ యాక్టివిటీ పెరిగితే తప్ప ఈ విషయంపై కదలిక రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే, పొత్తులపై మీ అభిప్రాయం ఏంటని పవన్ అడగడం మానేసినట్టే. వస్తే సంతోషం అనే మాట ఆల్రడీ పవన్ నుంచి వచ్చేసింది. పైగా ఇది ప్రజలు కోరుకున్న పొత్తు అని కూడా తేల్చేశారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా సీట్లు వస్తాయని, అదే టీడీపీతో పొత్తుతో వెళ్తే కచ్చితంగా అధికారంలోకి వస్తామని సూటిగా చెప్పేశారు. సో, ఇక తేల్చుకోవాల్సింది ఏపీ బీజేపీనే.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఏపీలో పొత్తులపై వామపక్షాలు ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తున్నాయి. బీజేపీ గనక పొత్తు పొట్టుకోం అనే కన్ఫామేషన్ ఇస్తే.. టీడీపీ, జనసేన కూటమితో కలిసి వెళ్లేందుకు వామపక్షాలు రెడీ అవుతున్నాయి. బీజేపీ కంటే కమ్యూనిస్టు పార్టీలకే అంతో ఇంతో ఓటు బ్యాంక్‌ ఉందన్నది ఆ పార్టీల వాదన. ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు సాయం చేయడం వల్లే టీడీపీకి రెండు స్థానాలను వచ్చాయని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ నుంచి గనక పొత్తుపై సానుకూల నిర్ణయం రాకపోతే.. టీడీపీ, జనసేన కూటమి వైపు వామపక్షాలు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే, చంద్రబాబు అరెస్ట్‌పై సంఘీభావం కూడా తెలిపాయి.

ఏపీలో పొత్తులను బీజేపీ పట్టించుకోవట్లేదా?

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తున్నామని పవన్ కల్యాణ్‌ అంత స్పష్టంగా చెప్పిన తరువాత.. ఆ మాట కేంద్ర బీజేపీకి తెలియకుండా అయితే పోదు. కచ్చితంగా దీనిపై డిస్కషన్ కూడా జరిగే ఉంటుంది. కొన్ని సోర్సెస్‌ చెబుతున్న దానిప్రకారం.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బీజేపీ అధిష్టానం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన.. టీడీపీతో పొత్తు ప్రకటన చేయడంపై అగ్ర నాయకత్వం ఇప్పటికే ఆరాతీసింది. కాని, ఈ విషయం బయటపెట్టకుండా.. ఎక్కడి నుంచి ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్తపడుతోందనైతే అర్ధమవుతోంది. ఇంతకీ ఢిల్లీ వెళ్లి పరిస్థితులు వివరిస్తానన్న పవన్ కల్యాణ్‌ ఇంత వరకు ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు? పరిస్థితులు అనుకూలించలేదా? నిజానికి బీజేపీ అగ్రనేతలను పవన్‌ కాంటాక్ట్‌ అయ్యారనేది పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్న అంశం. అయితే, హైకమాండ్‌ నుంచి ఆశించినంత సానుకూలత రాలేదని చెప్పుకుంటున్నారు. కేంద్ర బీజేపీ చెప్పిన దాని ప్రకారమే వారాహి యాత్రను అక్టోబర్ 1కి వాయిదా వేసుకున్నారని, పొత్తుపై బీజేపీ పెద్దల నుంచి పాజిటివ్ రియాక్షన్ రాకపోయే సరికి వారాహి యాత్రలో ఇలా రూటు మార్చారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైతే ఇవన్నీ అనుమానాలే. పవన్ కల్యాణో లేదా బీజేపీ హైకమాండ్ పెద్దలో చెబితే తప్ప ఈ విషయంలో నిజానిజాలు బయటకురావు. ఏదేమైనా.. జనసేన, టీడీపీలతో కలిసి వెళ్దామా లేక ఒంటరిగా వెళ్దామా అన్నఅంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఏపీ బీజేపీకి ఎటువైపు స్టెప్‌ తీసుకోవాలో అర్ధం కావడం లేదు. అలాగని టీడీపీతో వెళ్తున్న జనసేనను వదులుకోడానికి మాత్రం బీజేపీ రెడీగా లేదు. ఆ విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. జనసేనాని టీడీపీకి దగ్గరవుతున్నా.. తాము మాత్రం జనసేనతోనే కొనసాగుతామని బీజేపీ ఇప్పటికీ చెబుతోంది. రేప్పొద్దున పరిస్థితులు డిమాండ్‌ చేసి, పొత్తుపై కలిసి ముందుకు వెళ్లాల్సివస్తే ఎలా అనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా.. బీజేపీ జనసేనను వదలదలచుకోలేదు. జనసేన టీడీపీని వదిలిపెట్టాలనుకోవట్లేదు. మరి ఈ ట్రయాంగిల్ అలయన్స్ స్టోరీ ఎటువైపు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..