Andhra: ఫోన్ పే, గూగుల్ పేను మించిన ఫేస్ పే.. ఫోన్, ఏటిఎం లేకపోయినా నగదు విత్ డ్రా..

మీకు అండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లేదా.... ఫోన్ ఉన్నా ఇంటర్నెట్ లేదా.. డెబిట్ కార్డు, ఏటిఎం కార్డు లేవా.... మీ ఖాతా నంబర్ మర్చిపోయారా... అయినా మీరు నిశ్చితంగా వెళ్లి మీ ఖాతా నుండి డబ్బు డ్రా చేసుకోవచ్చు... ఇది ఎలా అంటారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రూపొందించిన పేస్ పే ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజలు సులభంగా తమ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఖాతాదారుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

Andhra: ఫోన్ పే, గూగుల్ పేను మించిన ఫేస్ పే.. ఫోన్, ఏటిఎం లేకపోయినా నగదు విత్ డ్రా..
Face Pay Machine

Edited By: Ram Naramaneni

Updated on: May 17, 2025 | 7:30 PM

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గ్రామీణ బ్యాంక్ మాత్రమే ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నాలుగు గ్రామీణ బ్యాంకు విలీనం అయి ఏపి గ్రామీణ బ్యాంక్ ఏర్పడింది. ఈ బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటిల్లో లక్షలాది మంది ఖాతాదారులున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉంటారు. వీరంతా బ్యాంక్‌కు వచ్చి  ఎక్కువ సమయం వేచి ఉండి డబ్బులు తీసుకెళ్లడం మనం సాధారణంగా చూస్తుంటాం. పెన్షన్ పంపిణీ, ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన డబ్బులు డ్రా చేసుకోవాలంటే తిప్పలు తప్పేవి కాదు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఒక కొత్త యాప్ తయారు చేసింది. పేస్ పే ద్వారా బ్యాంక్ వెళ్లి రెండు నిమిషాల్లో డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.

బ్యాంక్‌లో ఫేస్ పే మెషిన్ ఉంటుంది. మనం మెషీన్ ముందు నిలబడగానే మన పేస్ ఆధారంగా మన ఖాతా ఓపెన్ అవుతోంది. ఖాతాలో ఎంత మొత్తం ఉందో వాయిస్ కమాండ్ రూపంలో వినిపిస్తుంది. ఆ తర్వాత ఎంత మొత్తం డ్రా చేయాలనుకుంటున్నామో ఆ మొత్తాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంటర్ చేయగానే మనకు విత్ డ్రాయల్ ఫామ్ వస్తుంది. ఆ పామ్ క్యాష్ కౌంటర్‌లో ఇవ్వగానే మనకు క్యాష్ ఇస్తారు. ఇదంతా రెండు నిమిషాల్లోపే పూర్తవుతోంది. రాష్ట్రంలో ఏపిజిబి అతి పెద్ద బ్యాంక్‌గా రూపొందినట్లు బ్యాంక్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి చెప్పారు. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ యాప్ తీసుకొచ్చామని చెప్పారు. దీన్ని మరింతగా అభివృద్ధి చేసి నగదు డ్రా చేసుకోవడం, డిపాజిట్ చేయడం వంటి ఇతర అంశాలు జోడించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ఇటువంటి యాప్ రాష్ట్రంలో ఏ బ్యాంక్‌లో లేదని తమ ఖాతాదారులకు మాత్రమే ఇటువంటి అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. ప్రయోగాత్మకంగా పది బ్రాంచుల్లో అమలు చేస్తున్నామని త్వరలోనే రాష్ట్రంలోని అన్ని బ్రాంచుల్లో ఈ యాప్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అటు ఖాతాదారుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..