Andhra: ఇది కదా కావాల్సింది.. పొదుపు మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చింది. 16 రకాలు టెస్టులు చేసి.. వైద్య సేవలు అందిచనున్నారు. ముందుగా ఈ ప్రాజెక్టును శ్రీకాకుళ పట్టణ ప్రాంతాల్లో అమలు చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

Andhra: ఇది కదా కావాల్సింది.. పొదుపు మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
Self Help Group Women

Updated on: Oct 19, 2025 | 2:41 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పిన మాటను మరోసారి నొక్కి చెబుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పట్టణాల్లో నివసించే మధ్యతరగతి మహిళల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని తాజా సర్వేలు వెల్లడించాయి. దాంతో మహిళల ఆరోగ్య సంరక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం ‘సఖి సురక్ష హెల్త్‌కేర్ స్క్రీనింగ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రాజెక్టు మొదటి దశగా అమలుకానుంది. అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 19 వరకు వివిధ పట్టణాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 35 ఏళ్లు దాటిన పొదుపు మహిళలకు 16 రకాల ఆరోగ్య పరీక్షలు చేయబోతున్నారు. మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్‌, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకునే అవకాశం ఉంటుంది.

ఇటీవల నగరాల్లో నివసించే మహిళల్లో జీవనశైలి కారణంగా పెరుగుతున్న వ్యాధులు ప్రభుత్వానికి ఆందోళన కలిగించాయి. దీంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆరోగ్యపరంగా బలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో సుమారు రెండు వేల మంది మహిళలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్థానిక వైద్య బృందాలు, మునిసిపల్ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇక షెడ్యూల్‌ ప్రకారం .. శ్రీకాకుళంలో అక్టోబర్‌ 28, 29, నవంబర్‌ 1, 2 తేదీల్లో.. ఆమదాలవలసలో నవంబర్‌ 3, 4న.. పలాస–కాశీబుగ్గలో నవంబర్‌ 14, 15, 17న , ఇచ్ఛాపురంలో నవంబర్‌ 18, 19న వైద్య పరీక్షలు జరుగుతాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..