Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25 వేలు.. రెడీగా ఉండండి..
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే వారందరికీ ఒక్కొక్కరికీ రూ.25 వేలు అందించనుంది. ప్రస్తుతం పథకం అమలు కోసం విధివిధానాలు సిద్దం చేస్తోంది. అనంతరం దరఖాస్తులు ఆహ్వానించి లబ్దిదారుల లిస్ట్ ప్రిపేర్ చేయనుంది. ఆ తర్వాత డబ్బులు జమ చేయనుంది.

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో కొత్త పథకం అమలుకు సిద్దమైంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలను కొత్తగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్కీమ్ ప్రారంభించేందుకు సన్నద్దమవుతోంది. ఆ పథకం పేరే నేతన్న భరోసా. నేతన్నలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల ఆర్ధిక సాయం అందించనుంది. ఈ విషయాన్ని మంత్రి సవిత తాజాగా ప్రకటించారు. మంగళగిరిలోని ఆప్కో తోటలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త పథకం గురించి వివరాలు వివరించారు.
ఒక్కొ కార్మికుడికి రూ.25 వేల సాయం
చేనేత కార్మికుల కోసం త్వరలోనే నేతన్న భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ప్రస్తుతం కార్యచరణ సిద్దమవుతుందని, త్వరలోనే విధివిధానాలు విడుదల చేస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతీఒక్కరికీ ఈ పథకం కింద ఏడాదికి రూ.25 వేల సాయం అందించనున్నట్లు తెలిపారు. ఆప్కోకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్నో సంస్కరణలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆప్కో ద్వారా చేనేతలకు నూలును సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే రెడీ మేడ్ చేనేత వస్త్రాలు తయారుచేసేలా చేనేతలకు ఉచితంగా ట్రైనింగ్ కల్పిస్తామన్నారు. ఆప్కో ద్వారా చేనేత సహకరా సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని, ఈ నెల 15న రూ.4 కోట్లు, వచ్చే నెల తొలివారంలో రూ.2.50 కోట్లు రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
రెండేళ్లల్లో రూ.1.37 లక్షల కోట్లు
ఏపీలోని చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు సవిత వెల్లడించారు. ఏపీకి స్కోచ్ అవార్డు కూడా లభించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతల కోసం అనేక పథకాలు ప్రారంభిస్తున్నామని, బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని ఆమె అన్నారు. రెండేళ్లల్లో బీసీల సంక్షేమానికి రూ.1.37 లక్షల కోట్లు కేటాయించినట్లు సవిత పేర్కొన్నారు. చేనేతలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆప్కోతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. చేనేత సంఘాలు ముందుకు వస్తే టీటీడీకి అవసరమైన శాలువాలు, కండువాలు, ఇతర వస్త్రాల కొనుగోలుకు ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. ఆప్కో బలోపేతానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆ సంస్థను లాభాల బాట పట్టిస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు.
