AP Gender Budget: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు

|

May 19, 2021 | 4:34 PM

ఏపీ రాష్ట్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. ఇందులో పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు.

AP Gender Budget: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు
Ap Gender Budget 2021
Follow us on

Andhra Pradesh Gender Budget: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి నాంది పలకబోతోంది. ఇంతకాలం ఆ శాఖకు అన్ని కోట్లు… ఈ శాఖకు ఇన్ని కోట్లు… ఆదాయం అంత… ఖర్చు ఇంత… బడ్జెట్‌ పేరు వింటే చాలు ఠక్కున ఇలాంటి లెక్కలే గుర్తుకొస్తాయి. సామాన్యుడికి ఓ పట్టాన అర్థం కాని ఆల్‌జీబ్రా ఇది. లెక్కలు సరే కేటాయింపులు ప్రజలకు సరిగ్గా చేరుతుందా అంటే చెప్పలేని దుస్థితి. అందుకే పెట్టిన ప్రతి పైసా జనానికి అర్థమయ్యేలా… వారికి చేరేలా ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ పేరుతో ఎవరి కేటాయింపులు వారికి నేరుగా చేరేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఏపీ రాష్ట్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. ఇందులో పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు జరపనుంది జగన్ ప్రభుత్వం. దీని ఆధారంగానే ప్రతిపాదనలు కూడా స్వీకరించింది. ఫస్ట్‌ టైం ఈ టైప్‌ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గురువారం శాసనసభకు సమర్పించనున్నారు.

రేపు ఉదయం 9గంటలకు ఏపి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు మొదలుకానున్నాయి. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్నర్ బిశ్వభూష‌న్ హ‌రిచందన్ వ‌ర్చ్యూవ‌ల్ ప‌ద్దతిలో ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం తర్వాత 2021-22 ఆర్ధిక బ‌డ్జెట్‌ను రాజేందర్‌ ప్రవేశపెడతారు. ఇప్పటికే 3 నెల‌ల కాలానికి 70వేల 983.11 కోట్ల అంచనాతో ఓటాన్ అకౌంట్‌ను అర్డినెన్స్ రూపంలో ఆమోదించారు. మిగిలిన 9 నెల‌ల కాలానికి పూర్తి స్థాయి ఆర్ధిక బడ్జెట్‌ ఇది. క‌రోనా కార‌ణంగా ఒక్కరోజే అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించాల‌ని సర్కార్ నిర్ణయించింది.

వ‌రుస‌గా రెండో ఏడాది కూడా బ‌డ్జెట్‌పై క‌రోనా ఎఫెక్ట్ పడింది. గ‌తేడాది అంచనాల మేర‌కు ఇన్‌కం రాలేదు. సెకండ్ వేవ్‌తో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా బ‌డ్జెట్ అంచ‌నాలు 15 శాతం వ‌ర‌కు పెంచుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఆ పెంపు లేకపోవచ్చని తెలుస్తోంది. ఈసారి బ‌డ్జెట్ 2.28 లక్షల కోట్ల నుంచి 2.38 లక్షల కోట్ల వ‌ర‌కు ఉండొచ్చు.

ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి పిల్లలు, మహిళల కోసం కేటాయింపులను ఒక నివేదిక రూపంలో సమర్పించనుంది. గతంలోనే ఈ నిర్ణయం తీసుకుని అన్ని శాఖల నుంచి ఇదే తరహాలో ప్రతిపాదనలు స్వీకరించింది. 18ఏళ్లలోపు పిల్లలపై వివిధ పథకాల ద్వారా రాష్ట్రం ఎంత వెచ్చిస్తుందో విడిగా లెక్కలు కట్టి తాజా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నివేదించనుంది. మహిళల పథకాలకు కేటాయింపులు విడిగా, మహిళలు, బాలికల సంక్షేమ పథకాలు, కేటాయింపులను కూడా విడిగా చూపించనున్నారు.

ఇదే సమయంలో ప్రణాళికేతర వ్యయం, కార్యాలయాల నిర్వహణ, వాహనాల ఖర్చులపై కోత పడనుంది. వీటికి సంబంధించి 2020-21 బడ్జెట్‌లో దాదాపు అన్నింటిలోనూ 20శాతం వరకు కోత పెట్టారు. కార్యాలయాల అద్దె చెల్లింపులు భారమయ్యాయి. కొత్తగా వాహనాలు కొనవద్దని నిర్దేశించారు. కన్సల్టెంట్లు, పొరుగుసేవల సిబ్బంది నియామకంపై నియంత్రణ పెట్టారు. రేపటి బడ్జెట్‌లోనూ వీటన్నింటిపైనా ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.

జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ను తొలిసారి ఏపీ సర్కార్ ప్రవేశపెడుతోంది. మహిళలకు, పిల్లలకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టబోతోంది. ఇప్పటికే రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, ఒడిశా, కేరళ, అసోం, బీహార్‌, ఛత్తీస్‌గడ్‌, త్రిపుర, నాగలాండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది.

జెండర్ బేస్డ్‌ బడ్జెట్‌ అనేది జెండర్‌ రెస్పాన్సివ్‌ బడ్జెటింగ్‌ పేరుతో ప్రపంచమందా ఫాలో అవుతున్న బడ్జెట్‌ సూత్రం. దీని వల్ల జెండర్‌ అసమానత పోతుందని.. కేటాయించిన వారికే నేరుగా నిధులు చేరే ఛాన్స్‌ ఉంటుందన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ. మహిళలకు, పిల్లలకు కేటాయించిన ప్రతి రూపాయి వాళ్ల సంక్షేమానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. విద్య, వైద్యం, రక్షణ, న్యూట్రేషన్‌ పెరుగుదలకు ఈ టైప్‌ బడ్జెట్‌ దోహదపడుతుందన్నది నిపుణుల మాట.

Read Also… ఒక్క ఫోన్ చేస్తే చాలు..స్కార్పియో అంబులెన్స్ ఫ్రీ సర్వీస్..ఎక్కడంటే.. సొంత వాహనాన్ని పబ్లిక్ సర్వీస్ కు అంకితం చేసిన యువకుడు ..:viral video.