Free Bus Scheme: పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమల్లోకి.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రంలోని దివ్యాంగులను ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. ఈ మేరకు శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేయగా.. మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది.

Free Bus Scheme: పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమల్లోకి.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
Apsrtc free bus

Updated on: Mar 01, 2026 | 8:04 AM

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 28వ తేదీన ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 24వ తేదీన సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత శనివారం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కూటమి సర్కార్ నిర్ణయంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నాలుగు రకాల బస్సుల్లో..

పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం స్త్రీశక్తి పథకంలో భాగంగా ఈ బస్సుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అదే కేటగిరీ బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఫ్రీ జర్నీ అమల్లోకి వచ్చింది. ఇక నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్ రాష్ట్ర బస్సు బస్సుల్లో 50 శాతం రాయితీ ఎప్పటిలాగే దివ్యాంగులకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం అమల్లో ఉండగా.. ఇప్పుడు దివ్యాంగులైన పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అమల్లోకి వచ్చినట్లయింది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైక్యలం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుంది. ఏపీలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరికి పథకం నేటి నుంచి వర్తించనుంది.

ఇంద్రధనస్సు పేరిట 6 పథకాలు

గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు ప్రకటన చేశారు. ఇంద్రధనస్సు పథకం ద్వారా దివ్యాంగుల కోసం ఆరు పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు పథకం ఒకటి కాగా.. మిగతా పథకాలను దశలవారీగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు టికెట్లపై 50 శాతం రాయితీ అందుబాటులోకి ఉంది. కానీ ఇప్పటినుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అటు తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు 50 శాతం రాయితీ కల్పిస్తోన్నారు. దీంతో తెలంగాణలో కూడా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్య కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Follow Us