Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. రైతుల అకౌంట్లోకి రూ.30 వేలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఏపీలోని రైతులకు ఉపయోగపడేలా మరో కొత్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. పశువుల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పశువులు ప్రమాదశాాత్తూ మరణిస్తే రైతులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. ఇందుకోసం కొంత మొత్తంలో రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ప్రీమియంను ప్రభుత్వం భరిస్తుంది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. రైతుల అకౌంట్లోకి రూ.30 వేలు.. నేటి నుంచి దరఖాస్తులు
Money

Updated on: Jan 19, 2026 | 1:51 PM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాడి పశువులకు బీమా సౌకర్యం కల్పించనుంది. పశువుల పోషణపై ఆధారపడే రైతులకు ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకుంది. పశువుల బీమా పథకం పేరుతో అమలు చేయనున్న దీనికి సంబందించి దరఖాస్తులను జనవరి 19 నుంచి ఆహ్వానిస్తున్నారు. నేటి నుంచి రైతులు దరఖాస్తు చేసుకుని ఈ పథకంలో చేరవచ్చు. పశువులు మరణించినప్పుడు రైతులకు ఈ బీమా సొమ్మును అందిస్తారు. ఈ పథకంలో భాగంగా ప్రీమియం మొత్తాన్ని రైతులు చెల్లించాల్సిన అవసరం లేదు. 85 శాతం ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. మిగతా 15 శాతం ప్రీమియంను రైతులు చెల్లించాల్సి ఉంటుంది.

బీమా ఎంతంటే..?

గేదెలు, ఆవులకు రూ.30 వేలు, నాటు పశువులకు రూ,15 వేలు, మేలు జాతి ఎద్దులు, దున్నలకు రూ.30 వేలు, నాటు ఎద్దులు, దున్నలకు రూ.15 వేల చొప్పున బీమా ఉంటుంది. రూ.30 వేల విలువైన పశువులకు రూ.1920 ప్రీమియం ఉంటుంది. వీటిల్లో రూ.1632ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. మిగతా రూ.288 రైతులు చెల్లిస్తే సరిపోతుంది. ఇక రూ.15 వేలు విలువ చేసే పశువులకు ప్రీమియం రూ.960 ఉంటుంది. వీటిల్లో కేంద్ర వాటా పోనూ రైతుల వాటా రూ.144 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బీమా పథకంలో కొన్ని పరిమితులు విధించారు. గరిష్టంగా 10 ఆవులు, గేదెలకు మాత్రమే బీమా కల్పిస్తారు. ఇక 100 జీవాలు, 50 పందులకు మాత్రమే బీమా వర్తిస్తుంది.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..?

ఈ పథకానికి దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల్లో రైతులు తమ పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించుకోవడంతో పాటు బీమా  పథకంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే ప్రీమియం కూడా చెల్లించవచ్చు. ఈ నెల 31వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ శిబిరాల్లో కూడా పశువుల బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే ప్రీమియం కూడా చెల్లించవచ్చు. అలాగే ఈ ప్రత్యేక శిబిరాల్లో బీమా పథకంలో చేరని రైతుల వివరాలు కూడా ప్రదర్శిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో ప్రమాదవశాత్తూ పశువులు అనారోగ్యానికి గురై లేదా ప్రమాదంలో మరణిస్తే బీమా సొమ్ము రైతులకు అందుతుంది. పశు పోషణపై ఆధారపడి జీవించే రైతులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.