నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా(RK Roja) నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నగరిలోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా, సెల్వమణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. నగరి క్లాక్ టవర్ వద్ద మంత్రి రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. తన కష్టాన్ని గుర్తించిన జగనన్న తనను చెల్లెలుగా భావించి అండగా నిలిచారని మంత్రి రోజా అన్నారు. తన సేవలకు గుర్తుగా మంత్రి పదవి ఇచ్చారన్నారు. మూడోసారి తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేశారని.. అయితే జగన్ అండతో తాను నేడు నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. తనకు నగరి ప్రజలు అండగా నిలిచారని కొనియాడారు. గత ఐదేళ్లలో సుమారు రూ.2 వేల కోట్ల పైగా సంక్షేమ, అభివృద్ధి పనులను నగరి నియోజకవర్గంలో చేపట్టినట్లు వివరించారు. ఈసారి తప్పకుండా హ్యాట్రిక్ విజయం సాధించి జగనన్నకు గిఫ్ట్‌గా ఇస్తానని ధీమా వ్యక్తంచేశారు. 10 వేల మెజారిటీతో గెలుస్తానని.. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు అండగా ఉంటానన్నారు. నగరిలో వెన్నుపోటు రాజకీయాలు చేసే నాయకులకు మే 13 ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. సిఎం జగన్ సహకారంతో నగరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానన్నారు.
రోజాకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. వైసీపీలో రోజా ప్రముఖ లీడర్ అన్నారు. కష్ట కాలంలో వైసీపీలోని కొందరు అమ్ముడుపోయారని, అయితే కష్టంకాలంలో కూడా రోజా పార్టీకి, జగన్‌కు అండగా నిలిచారన్నారు. నగరిలో ఆర్కే రోజా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం అన్నారు.
వినాయక స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తున్న మంత్రి ఆర్కే రోజా..