ఏలూరు, సెప్టెంబర్ 5: ఆకలి ప్రతి జీవికి ఉంటుంది. సింహం వేటాడేటపుడు ఆవు సాధు జంతువని, జింక అందంగా ఉందని చూడదు. కేవలం తన ఆహారం కోసం వాటిని చంపి తినేస్తుంది. ఇక సర్పాలు, కప్పలు ఒక దాన్ని మరొకటి వేటాడి తినే ప్రాణులు. ఒక్కో జంతువు వేట ఒక్కో రకంగా ఉంటుంది. బల్లి గోడలపై ఉండి కాంతికి ఆకర్షించబడి వచ్చే పురుగులు తినేస్తుంది. కాని దానికి సైతం ఎంతో నేర్పు ఓర్పు కావాలి. ఇలా ఆహారం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఒక బల్లికి, ఆహ్లాదం కోసం వచ్చిన ఒక సీతాకోక చిలుక ఆహారమైంది. సాధారణంగా సీతాకోకచిలుక పొలాలమ్మటి , చెట్లన్నీ ఉండే పువ్వులపై వాలుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇళ్లల్లో లైటింగ్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. వీటిని పట్టుకోవాలంటే కష్టమే. చటుక్కున ఎగిరిపోతాయి.
కానీ ఓ బల్లి మాత్రం తన ఆహారాన్ని చాకచక్యంగా పట్టుకొని ఆహారంగా మలుచుకుంది. రంగురంగుల సీతాకోక చిలుక ఒకటి ఒక ఇంట్లో గోడ మీద వాలి ఉంది. ఇదే సమయంలో అదును చూసి ఆకలితో అదే గోడ పై వేచి చూస్తున్న బల్లి దాన్ని గమనించి నెమ్మదిగా మాటు వేసి చటుక్కున నోట కరిచి పట్టుకుంది. సీతాకోక చిలుక ప్రాణం పోయే వరకు వదల్లేదు. విద్యుత్తు వెలుగు కోసం వచ్చిన ఆ సీతాకోక చిలుక ఆ బల్లిని గమనించ లేదు. దాదాపు 2 నిమిషాలు ఆ బల్లి దాన్ని నోట కరిచి ఆహారం కోసం బలి తీసుకొంది. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా కుక్కునూరు బెస్తగూడెం గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ప్రపంచంలో అతిపెద్ద బటర్ ఫ్లై “క్వీన్ అలెగ్జాండ్రా బర్డ్‌వింగ్”. ఇది 30 సెం.మీ పొడవైన రెక్కలను కలిగి ఉంటుంది. పాపువా న్యూ గినియా ప్రాంతంని ఉష్ణమండల వర్షారణ్యాలలో కనిపిస్తుంది. సాధారణంగా సీతాకోకచిలుకలు ఎన్నో రంగుల్లో కనిపిస్తుంటాయి. భూమి ఉష్ణోగ్రతల్లో మార్పులు, మొక్కలు పుష్పించే సమయంపై ప్రభావం చూపించడంతో కొన్ని రకాల సీతాకోకచిలుకలు అంతరించిపోతున్నాయని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఇలా అంతరిస్తున్న వాటిలో గోధుమ రంగు సీతాకోకచిలుకలు ఉండటం ఆందోళన కరంగా మారింది.
ముఖ్యంగా సీతాకోకచిలుకలు పువ్వుల రంగు , వాటి సువాసనకు ఆకర్షించబడతాయి. నెక్టార్ అనే చక్కెర ద్రవం మొక్కల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. దీనిని సీతాకోకచిలుకలు సాధారణ ఆహారంగా తీసుకుంటాయి. గుడ్డు నుంచి సీతాకోక చిలుకగా మొత్తం జీవితచక్రం 3 – 4 వారాలు ఉంటే అందులో సీతాకోకచిలుక గా కేవలం ఏడు రోజులు మాత్రమే బ్రతుకుతుంది. దీని రెక్కలు పై ఉండే రంగులు ఆకర్షణీయంగా ఉండటంతో అందరూ వీటిని ఇష్టపడతారు. బటర్ ఫ్లై లను ఇష్టపడే వారికోసం ప్రత్యేకంగా పార్కులు సైతం మన దేశంలో ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.