Andhra Pradesh: గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు
2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారం అయ్యాయి. ఈసారి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు జరగనున్నాయి. టీటీడీ ఆస్తాన సిద్ధాంతి థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య నివేదిక ఆధారంగా ప్రభుత్వం తేదీలను నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఘాట్‌ల పునరుద్ధరణ, భద్రత, రవాణా, నీటి–ఆరోగ్య సేవల కోసం శాఖలు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నాయి. త్వరలోనే విభాగాల సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుష్కరాల తేదీలను ఖరారు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2027 సంవత్సరానికి వచ్చే గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగేలా నిర్ణయించింది. మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగనున్నాయని ఎండోవ్మెంట్స్ శాఖ స్పష్టంచేసింది. జిల్లాల వారీగా ఏర్పాట్లు ప్రారంభించేలా సంబంధిత విభాగాలకు వెంటనే సూచనలు పంపింది.
తేదీలను ఖరారు చేసిన టీటీడీ ఆస్థాన సిద్ధాంతి
తేదీల ఖరారులో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తాన సిధ్ధాంతి శ్రీ థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన అభిప్రాయం కీలకంగా నిలిచింది. పుష్కరాల ప్రవేశ–ప్రస్థాన ఘడియలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఆయన చేసిన జ్యోతిష్య విశ్లేషణను ఎండోవ్మెంట్స్ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, పుష్కరాలు జూన్ 26 ఉదయం ప్రారంభమై జూలై 7తో ముగుస్తాయి అనే సిధ్ధాంతి సూచనలను అంగీకరించింది. అనంతరం తేదీలపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది.
ఏర్పాట్లపై ఫోకస్
పుష్కరాల నిర్వహణకు సంబంధించి భద్రత, రవాణా, శానిటేషన్, నీటి సరఫరా, ఆరోగ్య సేవలు, యాత్రికుల వసతి ఏర్పాటు వంటి అంశాలపై విభాగాల మధ్య సమన్వయం కోసం త్వరలోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్‌లను పునరుద్ధరించడం, తాత్కాలిక స్నాన ఘాట్‌లు ఏర్పాటు చేయడం, రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించడం వంటి పనులను జిల్లాల కలెక్టర్లు ముందుగా ప్రణాళికలో పెట్టారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు రాష్ట్రంలోని వివిధ ఘాట్‌లకు చేరుకునే అవకాశం ఉండటంతో, సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రాథమిక పరిశీలనలు చేపట్టారు.
గెజిట్ కూడా విడుదల
ఉత్తర్వుల ప్రకారం, పుష్కరాల తేదీల నోటిఫికేషన్‌ను శుక్రవారం అసాధారణ గెజిట్‌లో ప్రచురించనున్నారు. సర్కారు తరఫున ఉత్తర్వులు జారీ చేసిన ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరి జవహర్లాల్, అన్ని సంబంధిత విభాగాలు తమ ప్రణాళికలను వేగవంతం చేయాలని సూచించారు. ఈసారి పుష్కరాలు వేసవి ముగింపు నాటికి రావడంతో, తాగునీటి అవసరాలు, ఆరోగ్య సేవల నిర్వహణ, రాత్రివేళల భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవస్థానాలు కూడా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక పూజలు, స్నాన ఘాట్ సేవలు, భక్తులకు సౌకర్యాలు అందించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరం, పోలవరం, భద్రాచలం, కోరుకొండ, కోటిపల్లి, దొండపూడి వంటి ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశంతో, స్థానిక అధికారులు ముందస్తు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్‌లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, వైద్య బృందాల నియామకం వంటి ఏర్పాట్లపై విభాగాలు పర్యవేక్షణ చేపట్టనున్నాయి.
2027 గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పుష్కరాల నేపథ్యంలో పలు ప్రధాన ప్రాజెక్టులు, ఘాట్ అభివృద్ధి పనులు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భక్తుల రద్దీ, వసతి సమస్యలు, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, ఈసారి పుష్కరాలు మరింత పర్యవేక్షణతో, సమన్వయంతో సాగేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.




