ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఐటిసి సంస్థ ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత గుంటూరులో జరిగే మైనార్టీ దినోత్సవం, వైద్య కళాశాల పైలాన్ ఆవిష్కరణలో సీఎం పాల్గొంటారు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులోని సుగంధ ద్రవ్యాల పార్కులో ఐటిసి సంస్థ మిర్చి ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. 6.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.250కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి, 9.25 గంటలకు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌కు చేరుకుంటారు. ఉదయం 9.40 – 10.35 వరకు ఐటిసి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 10.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.10 గంటలకు గుంటూరు చేరుకుంటారు. నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.50 గంటలకు గుంటూరు మెడికల్ కాలేజ్ చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా వైసీపీ నేతలతో భేటి అవుతారు. 1.25గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి 1.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పల్నాడు, గుంటూరు జిల్లాల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సుగంధ ద్రవ్యాల పార్కులో జరిగే కార్యక్రమంలో ఐటిసి ఛైర్మన్, మేనేజింగ్ డైకర్టర్ సంజీవ్ పూరి, రాష్ట్ర మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, అంబటి రాంబాబు పాల్గొంటారు.
గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మైనార్టీ సంక్షేమ దినోత్సవం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్ బాషతో పాటు మంత్రులు మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన కోసం నగరపాలక సంస్థ యంత్రాంగ అన్ని కూడళ్లను ముస్తాబు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..