విశాఖపట్నం కేంద్రంగా వీలైనంత త్వరగా సీఎం పాలన సాగించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచే పాలన కొనసాగేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఛాలెంజ్‌గా తీసుకుంది. రాజధాని మార్పు, వికేంద్రీకరణ లాంటి అంశాలు కోర్టుల్లో విచారణ జరుగుతున్నప్పటికీ.. వీలైనంత త్వరగా విశాఖకు సీఎం నివాసాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ నుంచే విశాఖకు ముఖ్యమంత్రి షిఫ్ట్ కావాలని ముందుగా అనుకున్నప్పటికి.. దసరాకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను వేగవంతం చేశారు. సివిల్ వర్క్ పూర్తై.. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్‌ను స్పీడ్ అప్ చేశారు. ఇంటీరియర్ పనులు కూడా మరో 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే టూరిజం శాఖ కార్యదర్శి కన్నబాబు రెండు రోజుల క్రితం విశాఖకు వచ్చి నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ, వీఎంఅర్‌డీఏ ఇతర అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేశారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఏ క్షణమైనా రావడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, అందుకు అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సుబ్బారెడ్డి కూడా అధికారులకు సూచించారు. దీంతో విశాఖ నుంచి త్వరలోనే సీఎం పాలన సాగిస్తారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నిర్మాణపనులు పూర్తవ్వడమే ఆలస్యం.. సీఎం విశాఖకు షిప్ట్ అవ్వడం గ్యారంటీ అని చెప్తున్నారు.
విశాఖలోని రుషికొండ చుట్టూ భద్రాతావలయం ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటక ప్రాజెక్టు చుట్టూ రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నారు. దీన్ని ఆరు అడుగుల నుంచి పది అడుగుల ఎత్తులో నిర్మించనున్నట్లు తెలుస్తుంది. అక్రమంగా ఎవరూ ప్రవేశించేందుకు వీలు లేకుండా నిర్మిస్తున్నారు. తాజాగా 8.58 కోట్లతో ప్రహరీ, మరో 4.20 కోట్లతో గార్డెనింగ్ కోసం టెండర్లు ఆహ్వానించారు. ఈ రిసార్టు వద్ద అత్యంత విలాసవంత అదనపు హంగులను ఏపీటీడీసీ ప్రణాళిక చేస్తుంది.
ఇక ముఖ్యమంత్రి విశాఖకి షిఫ్ట్ అయితే ఎలాంటి శాంతి భద్రతలకు ఆష్కారం లేకుండా విశాఖ పోలీస్ కమిషనరేట్ ని కూడా అడిషనల్ డీజీ కేడర్ కి అప్ గ్రేడ్ చేశారు. రీసెంట్ గానే అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యాన్నార్ విశాఖ సిపిగా బాధ్యతలు తీసుకున్నారు. శాంతిభద్రతల్లో పూర్తిస్థాయి మార్పులు తీసుకొచ్చే అంశాలను రవిశంకర్ పరిశీలిస్తున్నారు. గతంలో ఎంపి కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనలను దృష్టిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తున్నారు. సీఎం విశాఖకు సిప్ట్ అయ్యేనాటికి శాంతి భద్రతలకు అవసరమైన చర్యలన్ని పోలీస్ కమిషనరేట్ చేపడుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..