AP CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సారి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. సీఎం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే అప్పాయింట్ మెంట్ తీసుకున్నట్లుగా సమాచారం.
ఈ నెల 7న సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సీఎం క్యాంప్ అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్, విభజన సమస్యలు, వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ రాయడంతో ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. అదే రోజు సాయంత్రం సీఎం జగన్..అమిత్ షా తో భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితుల పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో కేంద్రం నుండి వ్యాక్సిన్ల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసారు. కానీ, ఇతర రాష్ట్రాల కంటే తక్కవ మొత్తంలో వ్యాక్సిన్లు ఏపీకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో తాజాగా ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసారు. దీని పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ అంశం పైన అమిత్ షా భేటీలో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది.