Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ వివరాలివే..

|

Dec 02, 2021 | 5:45 AM

Andhra Pradesh - Floods : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. భారీ వరదలతో ఎంతో మంది గల్లంతయ్యారు. పదుల సంఖ్యలో..

Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ వివరాలివే..
Cm Jagan
Follow us on

Andhra Pradesh – Floods : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. భారీ వరదలతో ఎంతో మంది గల్లంతయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, వరదల ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఆయన పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. డిసెంబర్ 2, 3 తేదీలలో వరద ప్రభావిత జిల్లాలైన కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న జిల్లాలో ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు పర్యటిస్తారు.

తొలిరోజు కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించనున్నారు సీఎం జగన్. నేరుగా బాధిత ప్రజలు, రైతులతో ఇంటరాక్ట్‌ కానున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా మాట్లాడనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ సీఎం పర్యటిస్తారు. ఇక రెండో రోజూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంటపొలాలను స్వయంగా పరిశీలించనున్నారు. అధికారులతో వరద నష్టం, సహాయ చర్యలపై సమీక్షలు నిర్వహిస్తారు.

డిసెంబరు 2న సీఎం పర్యటన ఇలా..
ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లా బయలుదేరనున్నారు సీఎం వైఎస్ జగన్‌. 10.50 గంటలకు కడప జిల్లా మందపల్లి(రాజంపేట) చేరుకుంటారు. అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళతారు. పుల్ల పొత్తూరు గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం జగన్ స్వయంగా పరిశీలిస్తారు. సహాయశిబిరంలో ఉన్న బాధితులతో సీఎం ముఖామఖిగా మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి.. గ్రామంలో వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో స్వయంగా కాలినడకన పర్యటిస్తారు. ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళతారు. దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలిస్తారు. కాగా, వరద ప్రభావం ఫలితంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టం పై సీఎంకు వివరాలందించనున్నారు అధికారులు. మధ్యాహ్నం 2.15 గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు. అక్కడ నుంచి రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని, కాలనీ ప్రజలతో వరదనష్టంపై ముఖాముఖి, సమీక్ష నిర్వహించనున్నారు. 4.30 గంటలకు ఏర్పేడు మండలం, పాపనాయుడు పేట గ్రామానికి చేరుకుంటారు. పాపనాయుడుపేటలో వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. అక్కడ నుంచి తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళతారు సీఎం జగన్. వరద నష్టంపై బాధితులతో మాట్లాడతారు. అనంతరం తిరుపతిలో పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి పద్మావతి అతిధి గృహంలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

డిసెంబరు 3న సీఎం పర్యటన ఇలా..
డిసెంబరు 3 వ తేదీన చిత్తూరు, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. డిసెంబరు 3వ తేదీన ఉదయం తిరుపతి, కృష్ణానగర్‌లో పర్యటించి, వరద నష్టాన్ని పరిశీలించడంతో పాటు స్ధానికులతో ముఖాముఖిగా మాట్లాడతారు. వరద ప్రభావం గురించి అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి ఆటోనగర్‌లో పర్యటిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా బయలుదేరి వెళతారు. నెల్లూరు రూరల్, దేవరపాలెం చేరుకుని, అక్కడ భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్డును, దెబ్బతిన్న వ్యవసాయ పంటలను సీఎం పరిశీలించనున్నారు. ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామానికి వెళ్లనున్నారు. పెన్నానదీ వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి పెనుబల్లి జొన్నవాడ చేరుకుని, వరద ధాటికి కొట్టుకుపోయిన ఆర్‌ అండ్‌ బి రహదారిని, పంచాయతీరాజ్‌ రోడ్లతో పాటు ఇసుక మేటలు వేసిన వరిపొలాలను స్వయంగా పరిశీలించనున్నారు. భారీ వర్షాలకు పంటలు, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు నెల్లూరు నగరపాలక సంస్ధ పరిధిలో భగత్‌ సింగ్‌ కాలనీకి చేరుకుంటారు. వరద ప్రభావంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శి్స్తారు. అక్కడ నుంచి దర్గామిట్ట, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చేరుకుని వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్నారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరద నష్టంపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరిగి 4.20 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Also read:

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..