AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చిత్తూరు విజయ డెయిరీకు పూర్వ వైభవం.. అమూల్ రూపంలో రీ ఓపెన్.. ప్రారంభించనున్న సీఎం జగన్..

చిత్తూరు విజయ డెయిరీకు పూర్వ వైభవం రాబోతుంది. దేశంలో అగ్రగామిగా రాణించిన విజయ డెయిరీ అమూల్‌గా సేవలు అందించబోతోంది. రెండు దశాబ్దాల క్రితం మూతపడ్డ సహకార రంగంలోని పాల డెయిరీ ఇప్పుడు ప్రైవేటు రంగంలో రీ ఓపెన్ కాబోతుంది.

Andhra Pradesh: చిత్తూరు విజయ డెయిరీకు పూర్వ వైభవం.. అమూల్ రూపంలో రీ ఓపెన్.. ప్రారంభించనున్న సీఎం జగన్..
Cm Ys Jagan
Shiva Prajapati
|

Updated on: Jul 04, 2023 | 5:48 AM

Share

చిత్తూరు విజయ డెయిరీకు పూర్వ వైభవం రాబోతుంది. దేశంలో అగ్రగామిగా రాణించిన విజయ డెయిరీ అమూల్‌గా సేవలు అందించబోతోంది. రెండు దశాబ్దాల క్రితం మూతపడ్డ సహకార రంగంలోని పాల డెయిరీ ఇప్పుడు ప్రైవేటు రంగంలో రీ ఓపెన్ కాబోతుంది. సీఎం జగన్ ఇవాళ ప్రారంభించబోతున్నారు. అవును, ఎట్టకేలకు అమూల్‌ రూపంలో రైతులకు సేవలు అందించబోతుంది విజయ డెయిరీ. 21 ఏళ్ల తరువాత పునఃప్రారంభానికి నోచుకోబోతుంది. విజయ డెయిరీ చరిత్ర, దాని లోతుల్లోకి వెళ్తే గతమెంతో ఘనకీర్తి. 1969లో పాల శీతలీకరణ కేంద్రంగా విజయ డెయిరీని అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రత్యేక చొరవ తీసుకొని రాయలసీమ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న ఎంపీ వీరరాఘవులు నాయుడు కృషితో 1978 మిల్క్ పౌడర్ కర్మాగారానికి భూమిపూజ చేశారు. 1979లో విజయ డెయిరీ పూర్తిస్థాయిలో రైతులకు సేవలు అందించడం ప్రారంభించింది.

దశలవారీగా ఫ్యాక్టరీ అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయగా రోజుకు 1.50 లక్షల లీటర్ల పాలను సేకరించి దేశంలో పాల ఉత్పత్తి రంగంలో రెండో స్థానంలో నిలిచింది. కరువు కాటకాలతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లా రైతులు విజయ డెయిరీ ఏర్పాటుతో పాడి పరిశ్రమ వైపు మెగ్గుచూపి ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. అయితే ఆ తర్వాత విజయ డెయిరీ నష్టాలబాట పట్టింది. సహకార రంగంలో నడుస్తున్న విజయ డెయిరీ ప్రైవేట్ డెయిరీల హవాను తట్టుకోలేక ఆర్థిక భారంతో 2003 లో మూతపడక తప్పలేదు.

విజయ డెయిరీ క్లోజ్ కావడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వమే కారణం అన్న ఆరోపణలున్నాయి. అప్పటి సీఎం చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కోసమే విజయ డెయిరీని మూత పడేలా చేశారన్న విమర్శలున్నాయి. దీనిపై అప్పట్లో విపక్షాలు రోడ్డెక్కి రైతాంగం తరపున పెద్ద ఉద్యమమే చేశాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విజయ డెయిరీని తెరిపించి పాడి రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటు, పాలరేట్ల ధరల పెంపుతో పాటు పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు మూతపడ్డ విజయ డెయిరీని మాత్రం తిరిగి తెరిపించలేక పోయాయి. బకాయిలు క్లియర్ చేసే ప్రయత్నాలు చేయలేక పోయాయి.

చిత్తూరు జిల్లా రైతులకు అండగా ఉంటానని సీఎం జగన్ 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విజయ డెయిరీని రీ ఓపెన్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అమూల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు పాల ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు జరిగేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అమూల్‌కు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అమూల్ సంస్థ రూ. 385 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 9 నెలల్లో ఉత్పత్తులు ప్రారంభించనుంది. దీని ద్వారా చిత్తూరు జిల్లాలో 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇవాళ సీఎం విజయడెయిరీని రీ ఓపెన్ చేస్తుండటంతో రెండు దశాబ్దాల తర్వాత చిత్తూరు జిల్లా పాడి రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..