AP News: వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. పండక్కి బట్టలు కొనుక్కునేందుకు నగదు
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకూ ఫలించిన విషయం తెలిసిందే. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు కార్మిక సంఘం నేతలు ప్రకటించారు. నేడు యధావిధిగా తమ విధులకు కార్మికులు హాజరయ్యారు. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు బొత్స సత్యనారాయణ.

జగన్ సర్కార్ మున్సిపల్ కార్మికులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. సంక్రాంతికి ప్రతి మున్సిపల్ కార్మికునికి కొత్త బట్టలు కొనుక్కునేందకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాల నేతలు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించారు. గురువారం తమ తమ విధులకు యధావిధిగా హాజరయ్యారు. అయితే ఇచ్చిన హామీలు జీఓలో లేకపోతే మళ్లీ సమ్మె చేస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.
చనిపోయిన కార్మికులు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
విజయవాడ సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం చర్చలు జరిపింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పని చేసే మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు మంత్రి బొత్స. మున్సిపల్ కార్మికులకు 21 వేల రూపాయల వేతనం ఇస్తామన్నారు. భవిష్యత్‌లో వేతనం పెంపుదల చేస్తే 21 వేల రూపాయల వేతనాన్ని బేసిక్ కింద పరిగణనలోకి తీసుకుని పెంచుతామన్నారు. సమ్మె కాలానికి కూడా జీతాలు కూడా చెల్లిస్తామని బొత్స వెల్లడించారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామన్నారు. చనిపోయిన కార్మికులు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు బొత్స. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 నుంచి ఏడు లక్షలకు సాయం పెంచామన్నారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకున్నా ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు బొత్స.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.