అది ఒకప్పటి శాతావాహనుల రాజధాని.. హిందూ మతంతో పాటు బౌద్ధం పరిఢవిల్లిన నేల.. మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న ప్రాంతం. అదే పల్నాడు జిల్లాలోని అమరావతి. అమరావతిలో అమరేశ్వరాలయంతో పాటు బౌద్ధ స్థూపం కూడా ఉంది. శాతవాహనుల సమయంలోనే ఇక్కడికి బౌద్దం వచ్చినట్లుగా చెబుతారు. ధాన్యకటకం పేరుతో అమరావతి చరిత్రలో పేరుగాంచింది. ఇటువంటి ప్రాంతంలో మరోసారి బౌద్ద ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడున్న బౌద్ద స్థూపాన్ని ప్రపంచలోని బౌద్దులు వచ్చి దర్శించుకుంటారు. 2004లో కాలచక్ర మహా సభలు కూడా అమరావతిలోనే జరిగాయి. బౌద్ద స్థూపం చుట్టు ఉన్న అనేక చారిత్రిక ఆనవాళ్లను సేకరించి ఇక్కడి మ్యూజియంలో భద్ర పరిచారు. అమరావతి శైలి శిల్పానికి కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అటువంటి ప్రాంతంలో మరోసారి పాలరాతి శిల్పం బయటపడింది.
ధరణి కోటలోని కొమ్మినేని పిచ్చయ్యకు చెందిన పొలంలో ఎప్పటిలానే వ్యవసాయ పనులు నిమిత్తం ట్రాక్టర్ తో దున్నతుండగా ఒక్కసారి ట్రాక్టర్ గొర్రుకు ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే పిచ్చయ్య కొడుకు వెంకట్రావు అక్కడ తవ్వకాలు చేపట్టగా పాల రాతి శిల్పం బయటపడింది. దీంతో ఆయన ఈ విషయాన్ని పురావస్తు శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెవిన్యూ, పురావస్తు శాఖాధికారులు పిచ్చయ్య పొలంలోకి వెళ్లి అక్కడ బయటపడిన శిల్పాన్ని పరిశీలించారు. అది క్రీపూ చెందిన శిల్పంగా గుర్తించారు. దానిపై గౌతమ బుద్దుని తల్లి మాయదేవికి చెలికత్తెలు సపర్యలు చేస్తున్నట్లు ఉంది. శిల్పం కింద అనాటి శాసనం కూడా చెక్కి ఉంది. అయితే అది ఏ కాలనికి చెందినది, శిల్పంపై ఉన్న భాష ఏంటి అన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
వెంటనే ఆ శిల్పాన్ని అమరావతిలోని బౌద్ద మ్యూజియంకు తరలించారు. ఇప్పటికీ అమరావతి ప్రాంతంలో అప్పుడప్పుడు పురాతన శిల్పాలు బయటపడటంపై స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. చరిత్ర పరిశోధకులు మాత్రం ధరణి కోటలో పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపడితే ఇంకా అనేక ఆనవాళ్లు బయట పడే అవకాశం ఉందంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..