వివేకా హత్య కేసులో పురోగతి..వైఎస్ ఫ్యామిలీని రహస్య విచారణ

వివేకా హత్య కేసులో పురోగతి..వైఎస్ ఫ్యామిలీని రహస్య విచారణ

ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో కాస్త నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిన సిట్ దర్యాప్తు బృందం మళ్లీ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో వైఎస్ కుటుంబసభ్యులైన భాస్కర్‌ రెడ్డి, మనోహర్ రెడ్డిలను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. వీరితో పాటు పలువురు టీడీపీ నేతలను వారు విచారిస్తున్నారు. మరో పది రోజుల పాటు వీరందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Dec 02, 2019 | 8:05 PM

ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో కాస్త నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిన సిట్ దర్యాప్తు బృందం మళ్లీ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో వైఎస్ కుటుంబసభ్యులైన భాస్కర్‌ రెడ్డి, మనోహర్ రెడ్డిలను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. వీరితో పాటు పలువురు టీడీపీ నేతలను వారు విచారిస్తున్నారు. మరో పది రోజుల పాటు వీరందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ ఏడాది మార్చి 15 న పులివెందులలోని తన స్వగృహంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులెవరో, దోషులెవరో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరో సిట్ బృందం ఏర్పాటు చేసింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్ కుటుంబీకులతో పాటు దాదాపు 13 వందల మంది అనుమానితులను దర్యాప్తు బృందాలు విచారించాయి. కీలక అనుమానితులకు నార్కో పరీక్షలలో పాటు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. హత్య జరిగిన సమయంలో సాక్ష్యాధారాలు చెరిపారన్న అభియోగంపై అరెస్ట్ అయిన నిందితులు.. ఆ తరువాత విడుదలై బయటే ఉన్నారు. ఇక వీరిలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకేసు దర్యాప్తుపై విపక్షాలు విమర్శల దాడి పెంచాయి.

ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు వివేకా హత్యకేసులో సాగుతున్న దర్యాప్తును ఎండగట్టాయి. మరోవైపు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్పీ అభిషేక్ మొహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. హత్య జరిగి 10 నెలలు కావస్తున్నా నిందితులు ఎవరన్నది నిర్ధారణకు రాకపోవడంతో.. విపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. మీడియాలో ఈ హత్యకేసు దర్యాప్తు వార్తలు వచ్చిన సందర్భంలో.. వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ హత్యకేసు దర్యాప్తులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. వైఎస్ కుటుంబసభ్యులతోపాటు, పలువురు టీడీపీ నేతలను దర్యాప్తు బృందం రహస్యంగా విచారిస్తోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. ‘‘పారదర్శకంగా విచారణ చేస్తున్నాం..దోషులెవరో తేలుస్తాం’’ అంటూ పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu