దేశాన్ని కుదిపేసిన విశాఖ గ్యాస్ లీకేజీ..
అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకోవడంతో నిద్రావస్థలోనే చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఆయా గ్రామాల్లో తలుపులు పగులగొట్టి మరీ బాధితుల్నిఆసుపత్రులకు తరలిస్తున్నారు.

అసలే కరోనా కష్టకాలం, నిన్నటి వరకు ఎప్పుడెప్పుడా అన్నట్లుగా నోరు తెరుచుకుని ఉన్న ఎంఫాన్ తుఫాను..ఏపీకి కంటిమీద కునుకులేకుండా చేసింది. అయితే, అదృష్టవశాత్తు తుఫాన్ గండం గడిచింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు కాస్తా తగ్గుముఖం పడుతున్నాయని అనుకుంటుండగా, పాలిమర్ విషవాయువు విశాఖ ఊపిరిని బిగ్గమట్టేలా చేసింది. విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై దాదాపు రెండు వేల మంది ఆసుపత్రుల పాలయ్యారు. అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకోవడంతో నిద్రావస్థలోనే చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఆయా గ్రామాల్లో తలుపులు పగులగొట్టి మరీ బాధితుల్నిఆసుపత్రులకు తరలిస్తున్నారు.
విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన పలు కుటుంబాలలో పెను విషాదాన్ని నింపింది. ఆదమరచి నిదురపోతున్నవారిని అదిరిపడి లేచి పరుగులెత్తేలా చేసింది. ఏం జరుగుతోందో తెలిసేలోగా తీవ్ర అస్వస్థతలోకీ, అపస్మారక స్థితిలోకీ నెట్టేసింది. రోడ్లపై పరుగులు తీస్తున్న వారు తీస్తున్నట్లే కుప్పకూలిపోయారు. చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. పశువులు విలవిలలాడాయి. గ్యాస్ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. భూపాల్ గ్యాస్ లీక్ ప్రమాద సంఘటన కంటే విశాఖ ప్రమాదం భయాకంగా కనిపించింది. చుట్టూ ఐదు కిలోమీటర్ల వరకు వ్యాపించిన గ్యాస్ కారణంగా పచ్చని చెట్లు కూడా రంగుమారి నిర్జీవంగా కనిపించాయి. మూగ జీవాల పరిస్థితి వర్ణనాతీతం. నోరులేని జీవాలు నురగలు గగ్గుతూ కుప్పకూలిపోయాయి.
ఇక, కంపెనీ నుండి లీకైన విషవాయువు కారణంగా 10 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. సుమారుగా రెండు వేల మంది బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఎక్కువ మంది వెంటిలేటర్స్‌పై నే ఆధారపడి ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రమాదంలో లీకైన గ్యాస్ చాలా ప్రమాదకరమైందని, దానివల్ల మనిషి పూర్తిగా అనారోగ్యం బారిన పడి అతి తక్కువ సమయంలోనే ప్రాణాలు కొల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు, వృద్దులతో పాటు యువకులు కూడా ఎక్కువ మందే ఉన్నారు.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జరిగిన ఘటన గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని, ఏడాది చాలా భయంకర ఘటనలు చూడాల్సి వస్తోందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.