టీడీపీలో ప్రజావేదిక చిచ్చురేపింది. ప్రజావేదికను కూల్చివేయడంపై టీడీపీ నేతలు చేస్తోన్న నిరసనను ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు తప్పుబట్టారు. ప్రజావేదిక కూల్చివేతకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే జనంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. టీడీపీ నేతలు మారకపోతే జనం క్షమించరని ఆయన అన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే బుద్ధా వెంకన్న ఆందోళన చేస్తున్నారన్న తోట.. ఇప్పటికైనా టీడీపీ నేతలు, అధినేత భజనకు స్వస్తి పలకాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజావేదికలో సామాన్లు ఉన్నాయని టీడీపీ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు పిలిచి అడిగితే.. తప్పకుండా బదులిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై కూడా సీఎం ఇలాగే స్పందించాలని తోట కోరారు. కాగా కొద్ది రోజులుగా టీడీపీ అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తోన్న తోట.. త్వరలో పార్టీ మారనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.