రెండవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ పై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. సున్నా వడ్డీ రుణాలపై సీఎం అసత్య ప్రకటనలు చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీసీ సభ్యులు ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో కరువు పై చర్చ సందర్భంగా సభను సీఎం తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. దీంతో రెండవ రోజు కూడా కరువు పై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. అయితే నిన్ననే చర్చ ముగిసిందని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. కాగా.. కరువు పై చర్చను కొనసాగించాలని సీఎం జగన్ కోరగా.. స్పీకర్ అందుకు అనుమతించారు. అదే సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మొదటిరోజు సభలో సీఎం జగన్ తీరు పై నిమ్మల రామానాయుడు విమర్శిస్తూ.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిని ఆయన హేళన చేశారని వ్యాఖ్యానించారు. మీకు దమ్ముంటే సభ నుంచి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. వడ్డీలేని రుణాలు ఎంత మొత్తం ఇచ్చామన్నది రికార్డులతో సహా చూపిస్తున్నామని చెప్పారు. వడ్డీ లేని రుణాలు రద్దు చేశారని అసత్యాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. వడ్డీలేని రుణాల కింద 2013-14లో రూ.349 కోట్లు.. 2014-15లో రూ.44 కోట్లు.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.570 కోట్లు పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఈ నిధులను విడుదల చేయాలని సీఎం జగన్‌ను కోరితే ఆయన నిరాకరించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
మరోవైపు తప్పుడు పత్రాలతో సభను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సభలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలని ఆయన అన్నారు.