ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆడియో ఫంక్షన్ల నుంచి సోషల్ మీడియా వరకు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారం నుంచి మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతూ గంట గంటకూ కొత్త మలుపు తీసుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనపై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
”హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?” ”ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!” అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గుదిబండలా మారారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి విమర్శించారు. తన స్వార్ధం కోసం బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని.. ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని అందరూ స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్ టికెట్ విధానం ద్వారా బ్లాక్ టికెట్లకు చెక్ పడుతుందని సజ్జల అన్నారు. ఈ విధానంపై ప్రభుత్వానికి వెనక్కి వెళ్లే ఆలోచన లేదన్న ఆయన.. 10 రోజుల్లో విధి విధానాల వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ తీరు సినీ పరిశ్రమ వాళ్లకే నచ్చడం లేదని సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవహారంలో ప్రభుత్వం ముందుకెళ్తోందని.. సినీ పెద్దలతో సమావేశానికి ఎప్పుడైనా సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని సజ్జల తెలిపారు. సినిమా టికెట్ల ఆదాయంపై రుణాలు తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నించిన సజ్జల.. పవన్ అసంబద్దంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. తాము ఎప్పుడూ మటన్ షాపులు పెడతామని చెప్పలేదని.. దీనిపై పవన్ రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. కాగా, సినిమా పెద్దలు సీఎంను ఎప్పుడైనా కలవచ్చునని సజ్జల రామకృష్ణరెడ్డి క్లారిటీ ఇచ్చారు.