ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వ్యవసాయ బడ్జెను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కారణంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ కాస్త ఆలస్యంగా 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4వేల కోట్లకు పైగా కేటాయింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
రైతులకు దీర్ఘకాలంగా మేలు చేసేలా ముందుకు సాగుతున్నామని, రైతుల సంక్షేమానికి అంకితమవుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘‘ సుదీర్ఘ పాదయాత్రలో సీఎం జగన్ రైతుల కష్టాలు చూసి చలించారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేస్తాం. కౌలు రైతులకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.విపత్తులు వచ్చినప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నాం. ప్రభుత్వ రాయితీలు అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది’’ అని బొత్స అన్నారు.
మొత్తం రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు మంత్రి బొత్స వివరించారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ.27,946.65 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.919.58 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.