రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. ఇది ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజికవర్గానికి చెందినదో కాదని పేర్కొన్నారు. అయిదు కోట్లమంది ప్రజలదని చెప్పిన ఆయన.. రాజధాని అంశంలో శివరామకృష్ణ కమిటీని గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉంది.. ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటికే ఈ ప్రాంతం ముంపునకు గురైతే,, పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఏమవుతుందో ఆలోచించాలన్నారు. కేపిటల్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ద్వంద్వార్ధాన్ని తలపిస్తున్నాయని బొత్స అభిప్రాయపడ్డారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని పవన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. కాగా అమరావతిపై ఏదో ఒకటి తేల్చాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. కీలకమైన ఈ అంశంపై బొత్స ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. త్వరలో అమరావతిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన చేసిన ప్రకటన అలజడి సృష్టించింది. కోడెల శివప్రసాద్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.