Jagan Delhi tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నుంచి బయల్దేరి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్ సహా పలువురు కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీకానున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చిస్తారు. తిరిగి రేపు (శుక్రవారం) మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
ఇలా ఉండగా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా రక్షణ, ఆర్థిక శాఖా మంత్రుల అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో జగన్ ఢిల్లీ పర్యటన షురూ చేసినట్టు తెలుస్తోంది. పోలవరం అంశంతోపాటు, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర సహకారాన్నీ కోరతారని సమాచారం.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు, కొవిడ్ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం వంటి అంశాలనూ సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సోమవారమే జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని భావించినప్పటికీ కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్లు దొరక్కపోవడంతో ఆ పర్యటన నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.