సందిగ్ధతకు తెరపడింది. ఇకపై ఎటువంటి అనుమానాలు లేవు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ‘అమ్మఒడి’ పథకం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఈ ప్రకటనతో అమ్మఒడి పథకంపై జరుగుతున్న ప్రచారాలకు తెరపడింది . గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ జగన్ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో చదివించేవారు..ఆర్థికంగా కొంత బలమైనవారే ఉంటారని..అంతేకాకుండా వారికి ఈ పథకం వర్తింపజేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య తగ్గిపోతుందంటూ కొంతమంది నిపుణులు అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే జగన్ విద్య, వైద్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నట్టు తమ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తున్నారు. ఎక్కడ మెరుగైన విద్య లభిస్తే తల్లిదండ్రులు వారిని అక్కడే చదివించుకుంటారని..వారే ప్రభుత్వ స్కూల్స్‌లో తమ పిల్లల్ని జాయిన్ చేసేలా గవర్నమెంట్ స్కూళ్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని జగన్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఏదేమైనా ప్రభుత్వం ఎన్నికల హామీపై ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నందున కచ్చితంగా ఏ స్కూల్లో చదివించే పిల్లల తల్లి అయినా ఈ మేరకు అమ్మఒడి పథకం కింద జనవరి 26న 15 వేల రూపాయలు అందుకోనున్నారు.