Amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. అన్ని సిద్ధం చేసిన కేంద్ర సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దతకు రంగం సిద్దమవుతుంది. వచ్చే వారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారంగా ఉంది.

Amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. అన్ని సిద్ధం చేసిన కేంద్ర సర్కార్..!
Amaravati As Ap Capital

Edited By:

Updated on: Jan 21, 2026 | 7:19 PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దతకు రంగం సిద్దమవుతుంది. వచ్చే వారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారంగా ఉంది. ఇందుకు అనుగుణంగా అమరావతిని ఎంపిక చేసి, 2014లో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఏపీలో పాలనా మార్పుతో జాప్యం జరిగింది.

అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి పక్కకు పోయి మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది. మళ్ళీ 2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి అమరావతిని రాజధానిగా ప్రకటించి పూర్తి స్థాయి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా… అమరావతి ఏపీ రాజధానిగా ప్రకటించనుంది కేంద్రం.

విభజన చట్టం ప్రకారం గత పదేళ్లుగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంది. 2024 జూన్‌ 2తో ఉమ్మడి రాజధాని గడవు ముగియడంతో ఏపీకి ప్రత్యేక శాశ్వత రాజధానిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని ,అమరావతిని ఎంపిక చేసిన ప్రక్రియ, అమరావతి ప్రాంతంలో చేపట్టిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నోట్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కోరింది.

2024 జూన్‌ 2 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా గడవు ముగుస్తున్నందున.. ఆరోజు నుంచే.. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో విభజన చట్టానికి నోడల్‌ ఏజన్సీగా ఉన్న కేంద్ర హోం శాఖ అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు మొదలు పెట్టింది. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి కేంద్ర హోం శాఖ అభిప్రాయలు కోరింది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయలు చెప్పినా… పట్టణాభివృద్ది, న్యాయ, వ్యయ శాఖల అభిప్రాయాలను త్వరగా పంపాలని హోం శాఖ కోరింది.

పలు మంత్రిత్వ శాఖలతో పాటు నీతి ఆయోగ్‌ అభిప్రాయం కేంద్ర హోం శాఖ కోరినట్లు సమాచారం. రెండు దఫాలుగా జరిగే బడ్జెట్‌ సమావేశాల్లోనే అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ ప్రకటించేందుకు కేంద్ర హోం శాఖ కసరత్తు చేస్తుంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే ముందు కేంద్ర కేబినెట్‌లో చర్చించి ఏపీ రాజధానిగా అమరావతికి ఆమోదం తెలపనుంది. అందుకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్‌ తయారు చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ పూర్తి చేసి కేంద్ర మంత్రిమండలిలో ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకు అమరావతి బిల్లు(ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు)రానుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉభయసభల్లో ఉండటంతో బిల్లు ఆమోదంతో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత ఏర్పడనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..