కోనసీమ(Konaseema) జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమలాపురంలో ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే.. అమలాపురంలో (Amalapuram) నిరసనలు జరిగి నేటికి 30 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ 144సెక్షన్ అమలవుతోంది. అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. నెల రోజులుగా కేసుల విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ జరగనున్న కేబినెట్ మీటింగ్ లో(AP Cabinet Meeting) అమలాపురం అల్లర్ల ఘటనపై ఏం చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఘటనపై ఇప్పటి వరకు 258 మందిని పోలీసుుల గుర్తించారు. 217 మందిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీని బదిలీ చేశారు. అమలాపురం జిల్లాకు కోనసీమ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్రరూపం దాల్చింది. మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. అంతేకాకుండా కొంతమంది రోడ్లపైకి వచ్చి రాళ్ల దాడికి దిగటంతో.. పోలీసులు పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు లాఠీచార్జ్ చేయడంతో పాటు ఒకదశలో గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఇక ఈ అల్లర్లలో జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు ఏకంగా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుండగా.. ఈ భేటీలో దేవాదాయ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలపనుంది మంత్రిమండలి. ఈ నెల 27న అమ్మఒడి పధకం నిధులు విడుదలకు చేసేందుకు ఆమోదిస్తారు. పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.